భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం శుక్రవారం(జనవరి 23) ధ్రువీకరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మోదీ ఇజ్రాయెల్‌కు వెళ్లే అవకాశముంది. భారత ప్రధాని మోదీని ఇజ్రాయెల్‌కు ఆహ్వానించినందుకు మేము సంతోషిస్తున్నాము. ఆయనకు స్వాగతం పలికేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాము అని ఇజ్రాయెల్ ఎంబసీ ఒక ప్రకటనలో పేర్కొంది.
భారత్, ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాల ప్రధానులు మోదీ, బెంజమిన్ నెతన్యాహు చర్చలు జరపనున్నారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, గాజా శాంతి ప్రణాళికలపై నెతన్యాహుతో మోదీ మాట్లాడే అవకాశముంది.
ఇటీవలే నెతన్యాహు.. నరేంద్ర మోదీతో ఫోన్‌లో సంభాషించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో జీరో టాలరెన్స్ విధానాన్ని పాటించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. మోదీ తొలిసారి 2017లో ఇజ్రాయెల్‌లో పర్యటించారు.


