డెల్టా వేరియంట్‌ అత్యంత ప్రమాదకరం

Only one strain of Covid-19 Delta variant found in India - Sakshi

డబ్ల్యూహెచ్‌వో ఆందోళన

ఆసియా దేశాలపై తీవ్ర ప్రభావం  

జెనీవా: భారత్‌లో మొట్టమొదటిసారిగా బయటపడిన బి.1.617 కోవిడ్‌–19 వేరియెంట్‌లో ఒక రకం అత్యంత ప్రమాదకరంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. డెల్టా అని పేరు పెట్టిన ఈ రకం జూన్‌ 1 నాటికి ప్రపంచవ్యాప్తంగా 62 దేశాలకు వ్యాపించిందని తెలిపింది. ఈ రకం కరోనాతో ఆసియా దేశాలకు ఎలాంటి ముప్పు ఉందో ఊహించడానికే కష్టంగా ఉందని తన వారాంతపు నివేదికలో పేర్కొంది. కరోనాలో  బి.1.617 వేరియంట్‌  తొలిసారిగా భారత్‌లో బయట పడింది. ఆ తర్వాత అది తన జన్యు స్వరూపాన్ని మార్చుకొని బి.1.617.1, బి.1.617.2, బి.1617.3... ఇలా మూడు రకాలుగా మారి వ్యాపించడం మొదలైంది. వీటిలో బి.1.617.2 రకం (దీనిని డెల్టా వేరియెంట్‌గా పిలుస్తున్నారు) అత్యంత ప్రమాదకరంగా పరిణమించిందని, ఈ వైరస్‌ శరవేగంగా విస్తరిస్తోందని డబ్ల్యూహెచ్‌వో తన నివేదికలో హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన రెండు రకాలతో పెద్దగా ప్రమాదం లేదని స్పష్టం చేసింది.  

ప్రమాదంలో ఆసియా దేశాలు
భారత్‌లో బయటపడిన డెల్టా రకంతో ఆసియా దేశాలకు పెను ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. శరణార్థులకు కూడా ఈ వైరస్‌ సోకుతూ ఉండడంతో ఏం చేయాలో తెలీని పరిస్థితి నెలకొందని యునైటెడ్‌ నేషన్స్‌ హై కమిషనర్‌ ఫర్‌ రిఫ్యూజీస్‌ (యూఎన్‌హెచ్‌సీఆర్‌) అధికార ప్రతినిధి ఆండ్రేజ్‌ మహెకిక్‌ అన్నారు. ఆసియా, పసిఫిక్‌ దేశాల్లో ఆరోగ్య వ్యవస్థ బలోపేతంగా లేకపోవడం, వ్యాక్సిన్‌ అన్ని దేశాలకు అందుబాటులో లేకపోవడంతో డెల్టా వైరస్‌ అత్యధిక దేశాలకు విస్తరిస్తోందని అన్నారు. డెల్టా వేరియంట్‌ కారణంగా గత రెండు నెలల కాలంలోనే ప్రపంచ దేశాల్లో 3.8 కోట్ల కేసులు నమోదయ్యాయని, 5 లక్షలకు పైగా మరణాలు సంభవించాయన్నారు. అన్ని దేశాల్లోనూ వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయితేనే ఈ మహమ్మారికి అడ్డుకట్ట పడుతుందని ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top