ఫోన్‌లో జేడీ వాన్స్‌ మీమ్‌ ఉన్నందుకు  అమెరికాలో ప్రవేశించనివ్వలేదు  | Norwegian tourist denied entry into US over bald JD Vance meme | Sakshi
Sakshi News home page

ఫోన్‌లో జేడీ వాన్స్‌ మీమ్‌ ఉన్నందుకు  అమెరికాలో ప్రవేశించనివ్వలేదు 

Jun 26 2025 5:29 AM | Updated on Jun 26 2025 5:29 AM

Norwegian tourist denied entry into US over bald JD Vance meme

నార్వే యువకుని ఆరోపణ 

న్యూయార్క్‌: ఫోన్‌లో జేడీ వాన్స్‌ బట్టతల మీమ్‌ ఫొటో ఉన్నందుకు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తనను అమెరికాలో ప్రవేశించనివ్వలేదని నార్వేకు చెందిన పర్యాటకుడు ఆరోపించారు. తనకు ఎలాంటి నేరచరిత్ర లేకపోయినా.. తాను నెవార్క్‌ విమానాశ్రయంలో దిగిన మరుసటి రోజు తిప్పి పంపారని తెలిపాడు. నార్వేకు చెందిన 21 ఏళ్ల మాడ్స్‌ మికెల్సెన్‌ న్యూయార్క్, టెక్సాస్, ఆస్టిన్‌లలో స్నేహితులను కలవడానికి అమెరికాకు వెళ్లాడు. అలాగే తన తల్లితో కలిసి రోడ్‌ ట్రిప్‌లో జాతీయ ఉద్యానవనాలను సందర్శించాలనుకున్నాడు. కానీ నెవార్క్‌ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు మికెల్సెన్‌ను అడ్డుకున్నారు.

 ‘నన్ను అనేక మంది సాయుధ గార్డులు ఉన్న గదికి తీసుకెళ్లారు. అక్కడ నా బూట్లు, మొబైల్‌ ఫోన్, బ్యాక్‌ప్యాక్‌ను తీసుకున్నారు. అధికారులు నా ఫోన్‌ను అన్‌లాక్‌ చేయమని ఒత్తిడి తెచ్చారు. నిరాకరిస్తే జైలు శిక్ష లేదా 5వేల డాలర్ల జరిమానా విధిస్తామని బెదిరించారు. సందర్భాన్ని వివరించిన తర్వాత కూడా, అధికారులు నా వస్తువులను తనిఖీ చేశారు. వేలిముద్రలను తీసుకున్నారు. రక్త నమూనాలను సేకరించారు. అమెరికాలో నేను కలవాలనుకున్న వారందరి పేర్లు, చిరునామాలు, ఫోన్‌ నంబర్లు, వృత్తుల వివరాలు అడిగారు. నేను పన్నెండు గంటలు ప్రయాణించాను. సరిగ్గా నిద్రపోలేదు.

 వారు ప్రశ్నించడం ప్రారంభించే ముందే శారీరకంగా, మానసికంగా పూర్తిగా అలసిపోయాను. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాద కుట్రలు, మితవాద తీవ్రవాదంలో పాల్గొన్నట్లు అధికారులు నాపై ఆరోపణలు చేశారు. కానీ నిజానికి కారణం అది కాదు. నా ఫోన్‌లో జేడీ వాన్స్‌ మీమ్‌ ఫొటో ఉంది. అందులో ఆయన బట్టతలతోఉన్నారు. అలాగే నేను చేతిలో ఒక చెక్క పైపుతో ఉన్న ఫొటో కూడా వారికి నచ్చలేదు. ఈ రెండు చిత్రాలు అమెరికాలోకి ప్రవేశించకుండా నన్ను అడ్డుకుంటాయని అనుకోలేదు. మరునాడు నన్ను నార్వే వెళ్ళే విమానంలో ఎక్కించారు’అని మికెల్సెన్‌ ఆరోపించారు. ఈ వీడియో సామా జిక మాధ్యమంలో వైరల్‌ అయ్యింది.  
 

Advertisement
 
Advertisement
Advertisement