అట్టహాసంగా ఉత్తర కొరియా సైనిక పరేడ్‌

North Korea Kim Jong Un presides over big military parade - Sakshi

కిమ్‌ జోంగ్‌ ఉన్‌తోపాటు పాల్గొన్న కుమార్తె కిమ్‌ జూ అయే

సియోల్‌: ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తన సైనిక బలాన్ని మరోసారి ప్రదర్శించారు. రాజధాని పాంగ్‌యాంగ్‌లో బుధవారం రాత్రి సైనిక పరేడ్‌ అట్టహాసంగా నిర్వహించారు. అమ్ముల పొదిలోని కీలక ఆయుధాలతోపాటు అత్యాధునిక, భారీ అణు క్షిపణులకు సైతం ఈ పరేడ్‌లో చోటుకల్పించారు. కిమ్‌ జోంగ్‌ ఉన్‌తోపాటు ఆయన కుమార్తె కిమ్‌ జూ అయే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పది సంవత్సరాల వయసున్న కిమ్‌ జూ అయే భవిష్యత్తులో ఉత్తర కొరియా పాలనా పగ్గాలు చేపట్టడం ఖాయమన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.

కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తన కుమార్తెను ఆ దిశగా సన్నద్ధం చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కిమ్‌ జూ అయే బహిరంగంగా ప్రజలకు కనిపించడం ఇది ఐదోసారి. ఆమె కిమ్‌కు రెండో సంతానమని తెలుస్తోంది. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె తండ్రితోపాటు కనిపించారు. మరిన్ని అణ్వాయుధాలను సొంతం చేసుకోవడానికి కిమ్‌ తీవ్రంగా శ్రమిస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు.

రాబోయే రోజుల్లో నూతన ఘన–ఇంధన ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని ఉత్తర కొరియా పరీక్షించబోతున్నట్లు అంచనా వేస్తున్నారు. తాజా సైనిక పరేడ్‌లో డజనుకుపైగా ఖండాంతర బాలిస్టిక్‌ మిస్సైళ్లను ప్రదర్శించారు.  పొరుగు దేశమైన దక్షిణ కొరియాతోపాటు అగ్రరాజ్యం అమెరికాతో ఉత్తర కొరియా కయ్యానికి కాలు దువ్వుతోంది. పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల వనరులు పరిమితంగా ఉన్నప్పటికీ అత్యాధునిక అణ్వాయుధాల తయారీపై కిమ్‌ దృష్టి పెట్టడం ఆసక్తికరంగా మారింది.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top