
వాషింగ్టన్ డీసీ: ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. ఇటీవల మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్’లో యూఎస్‌లో కొత్త రాజకీయ పార్టీ కోసం పిలుపునిచ్చారు. అగ్రరాజ్యంలో కొత్త పార్టీకి సమయం ఆసన్నమయ్యిందా? అని మస్క్ ‘ఎక్స్’ యూజర్లను అడిగారు. దీనికి వచ్చిన ఆసక్తికర ఫలితాలను తాజాగా ఆయన వెల్లడించారు.
మస్క్ తెలిపిన వివరాల ప్రకారం అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు 80 శాతం మంది యూజర్లు మద్దతు పలికారు. ఈ ఫలితాల వెల్లడి తరువాత మస్క్ తన రాజకీయ పార్టీకి ‘ది అమెరికా పార్టీ’ అని పేరు పెడుతున్నట్లు తెలిపారు. ‘ఎక్స్’లో వైరల్ అవుతున్న ఈ పోస్టులో మస్క్.. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందని, 80 శాతం ప్రజలు దీనికి మద్దతు పలుకుతున్నారని తెలిపారు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌లో మస్క్ పలు విమర్శలు చేశారు. తాను లేకుంటే ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవారని, అతనికి కృతజ్ఞత లేదని మస్క్ ఆరోపించారు. దీనికి స్పందనగా ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ట్రూత్‌లో మస్క్ కంపెనీలకు ఫెడరల్ కాంట్రాక్టులు, సబ్సిడీలను రద్దు చేస్తానని హెచ్చరించారు. ఎలాన్ మస్క్- డోనాల్డ్ ట్రంప్ మొన్నటి వరకూ ఎంతో సన్నిహితులుగా మెలిగారు. గత జూలైలో పెన్సిల్వేనియా ర్యాలీలో హత్యాయత్నం నుండి ట్రంప్ తృటిలో బయటపడిన అనంతరం మస్క్ బహిరంగంగా ఆయనకు మద్దతును ప్రకటించారు. అయితే ప్రస్తుతం వీరి మధ్య వైరం తారాస్థాయికి చేరింది.

ఇది కూడా చదవండి: 400 డ్రోన్లు, 40 క్షిపణులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా