
వాషింగ్టన్: ఈరోజు (జూలై 6) టిబెటన్ల ఆధ్మాత్మిక గురువు దలైలామా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు ప్రపంచం నలుమూలల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి. అయితే అమెరికా దలైలామాకు ప్రత్యేక సందేశంతో శుభాకాంక్షలు తెలిపింది. ఒకవైపు టిబెటిన్లకు మద్దతు పలుకుతున్నట్లు, మరోవైపు చైనాను హెచ్చరిస్తున్నట్లు అమెరికా సందేశం ఉండటం విశేషం.
90వ పుట్టినరోజు జరుపుకుంటున్న దలైలామాకు అమెరికా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. టిబెటన్లు తమ మత పెద్దలను స్వేచ్ఛగా, ‘ఇతరుల జోక్యం లేకుండా’ ఎన్నుకునే సామర్థ్యాన్ని కాపాడుకునేందుకు అమెరికా మద్దతు ఇస్తుందని పేర్కొంది. ప్రపంచానికి దలైలామా ఐక్యత, శాంతి, కరుణల సందేశాన్ని అందిస్తూ, ప్రజల్లో శాంతి నెలకొల్పుతున్నారని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పేర్కొన్నారు.
చైనా పేరు ఎత్తకుండానే రూబియో.. టిబెటన్ల సాంస్కృతిక, మత స్వేచ్ఛకు అమెరికా మద్దతు ఇస్తుందనే సందేశాన్ని తెలియజేశారు. టిబెటన్ల హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛల పట్ల గౌరవాన్ని పెంపొందించేందుకు యునైటెడ్ స్టేట్స్ కట్టుబడి ఉందన్నారు. టిబెటన్ల ప్రత్యేక భాష, సాంస్కృతిక, మతపరమైన వారసత్వాన్ని కాపాడే ప్రయత్నాలకు తాము మద్దతు ఇస్తున్నామని, ఇతరుల జోక్యం లేకుండా వారు మత పెద్దలను స్వేచ్ఛగా ఎన్నుకునే సామర్థ్యాన్ని కాపాడుతామని అన్నారు. తదుపరి దలైలామాను ఎన్నుకునే హక్కు తమకే ఉందని చైనా చెబుతున్న ప్రస్తుత తరుణంలో అమెరికా వ్యాఖ్యలు కీలకంగా మారాయి. కాగా టిబెట్‌పై చైనా చారిత్రక అధికారాన్ని డిమాండ్ చేస్తోంది. సామ్రాజ్య యుగం నాటి సంప్రదాయాలను గుర్తుచేస్తూ, తదుపరి దలైలామాను ఆమోదించే హక్కు తమకే ఉందని బీజింగ్ తరచూ చెబుతోంది. టిబెట్‌లో అనుసరించే మతపరమైన ఆచారాలపై కఠినమైన నియంత్రణను కొనసాగిస్తోంది.