వ్యక్తిగత విషయాలు బయటపెట్టిన మేఘన్‌ మార్కెల్‌

Meghan Markle Says She Had Miscarriage - Sakshi

మొదటి బిడ్డ తర్వాత గర్భస్రావం అయ్యింది

పుట్టకముందే ఓ బిడ్డను పొగొట్టుకున్నా

సంచలనంగా మారిన మేఘన్‌ వ్యాఖ్యలు

లండన్‌: అమ్మవ్వడంలో ఉండే ఆనందం అనుభవిస్తేనే తెలుస్తుంది. పండంటి బిడ్డకు జన్మనిస్తేనే తమ జీవితానికి ఓ అర్థం అని భావించే ఆడవారు కొకొల్లలు. బిడ్డను కనడం ఎంతటి సంతోషాన్ని ఇస్తుందో.. అలానే కడుపులోని ప్రాణి బయటకు రాకముందే కన్నుమూస్తే.. ఆ బాధ వర్ణణాతీతం. అనుభవించడం తప్ప మాటల్లో చెప్పడం కష్టం. ఈ క్రమంలో డచెస్​ ఆఫ్ ససెక్స్, ప్రిన్స్​ హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ సంచలన విషయాలు వెల్లడించారు. రెండవ సారి గర్భవతి అయ్యాక తనకు అబార్షన్‌ అయ్యిందని.. పుట్టకముందే ఓ బిడ్డను పొగొట్టుకున్నానని తెలిపారు. బ్రిటన్‌ రాజవంశానికి చెందిన ఓ ఉన్నత వ్యక్తి ఇలా తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు బయటకు వెల్లడించడం.. అందులోనూ ఇలాంటి విషయాల గురించి మీడియాతో మాట్లాడటం ఇదే ప్రథమం. దాంతో ప్రస్తుతం మేఘన్‌ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. (చదవండి: ‘ప్రపంచం మొత్తం మీద నా మీదే ఎక్కువ ట్రోలింగ్‌’)

మేఘన్‌ మార్కెల్‌ న్యూయార్క్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ తన ఆవేదనను వెల్లడించారు. విషాదం గురించి మాట్లాడుతూ.. ‘మొదటి బిడ్డను నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఎంత సంతోషం అనుభవించాను రెండో బిడ్డను కడుపులోనే పొగొట్టుకున్నప్పుడు అంతకు రెట్టింపు బాధపడ్డాను. బిడ్డను కొల్పోవడం అంటే భరించలేని బాధను మోయడం. ఎందరో అనుభవిస్తారు.. కొందరు మాత్రమే బయటకు వెల్లడిస్తారు. గుండెని పిండే ఈ వార్త నాకు తెలిసినప్పడు నేను ఆస్పత్రి బెడ్‌ మీద ఉన్నాను.. నా భర్త నా పక్కనే ఉన్నాడు. కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడ్చాను. ఆ తర్వాత నేను, నా భర్త నాలానే అబార్షన్‌ అయ్యి బిడ్డను కోల్పోయిన కొందరిని కలుసుకున్నాము. బాధలో తేడా లేదు. కానీ వీరిలో కొందరు తమకు జరిగిన నష్టం గురించి మాట్లాడేందుకు సిగ్గుపడ్డారు. ఒంటరిగా బాధను భరించారు’ అని తెలిపారు. ఇక ఈ ఆర్టికల్‌లో మేఘన్‌ అనేక సన్నిహిత వివరాలను వెల్లడించారు. మేఘన్, హ్యారీ దంపతులకు కుమారుడు ఆర్చీ ఉన్నారు. (చదవండి: అభద్రతకు గురైన మేఘన్ మార్కెల్)

బ్రిటీష్‌ రాజకుటుంబంలోని సీనియర్‌ సభ్యుల వ్యవహార శైలికి భిన్నంగా మేఘన్‌ వ్యక్తిగత వివరాలు తెలిపారు. ఇక 68 ఏళ్ల పాలనాకాలంలో క్వీన్‌ ఎలిజబెత్‌ ఎన్నడు ఏ మీడియా సమావేశంలో కూడా తన వ్యక్తిగత వివరాలు బహిర్గతం చేయలేదు. ఇక హ్యారీ సోదరుడు ప్రిన్స్‌ విలియం, అతడి భార్య కేట్‌ ఇప్పటి వరకు ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చారు. ప్రతిసారీ పుట్టిన బిడ్డతో కలిసి దంపతులు మీడియాకు ఫోజులిచ్చేవారు. విలియం-కేట్‌ దంపతులు కూడా తమ వ్యక్తిగత జీవితం గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top