రూ.8.82 కోట్ల విలువైన కార్లను తుక్కుతుక్కు చేశారు..

Luxury Cars Worth 1200000 Dollars Crushed to Pieces in Philippines - Sakshi

దేశంలోకి అక్రమంగా వచ్చిన కార్లను ధ్వంసం చేస్తున్న ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు

మనీలా: లక్షల రూపాయలు ఖరీదు పెట్టి ఎంతో ఇష్టంగా కొనుకున్న కారు మీద చిన్న గీత కనిపించినా మనసు కలుక్కుమంటుంది. చాలా రోజుల పాటు దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం. అలాంటిది కోట్ల రూపాయలు విలువ చేసే కార్లను తుక్కుతుక్కుగా మార్చితే.. అబ్బో తల్చుకోవడానికే బాధగా ఉంది కదా. కానీ ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం మాత్రం ఇదేం పట్టించుకోవడం లేదు. కోట్ల రూపాయలను విలువ చేసే లగ్జరీ కార్లను వరుసగా పార్క్‌ చేసి ఆ తర్వాత బుల్డోజర్‌తో వాటిని తుక్కుతుక్కుగా మార్చేస్తుంది. ఎందుకంటే ఈ కార్లను దేశంలోకి అక్రమంగా తీసుకువచ్చారట. దాంతో కార్‌ స్మగ్లర్స్‌ను గట్టిగా హెచ్చరించడం కోసం ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 1.2మిలయన్‌ డాలర్లు(రూ. 8,89,72,920.00) విలువ చేసే 21 కార్లను ఇలా తుక్కుగా మార్చేసింది.  

ఇలా ధ్వంసం చేసిన కార్లలో మెక్‌లారెన్ 620 ఆర్, పోర్స్చే 911, బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అంతేకాకుండా, మెర్సిడెస్ ఎస్‌ఎల్‌కే, లోటస్ ఎలిస్, మాడిఫైడ్‌ హ్యుందాయ్ జెనెసిస్ కూపే, టయోటా సోలారా, 14 “మిత్సుబిషి జీపు’’లను ఇలా తుక్కుగా మార్చింది. బ్యూరో ఆఫ్ కస్టమ్స్ ప్రకారం, ఈ లగ్జరీ కార్లన్నీ వేర్వేరు మార్గాల ద్వారా దేశంలోకి "అక్రమ రవాణా" చేయబడ్డాయి. 2018 నుంచి 2020 వరకు వేర్వేరు సందర్భాల్లో వీటిని స్వాధీనం చేసుకుని తుక్కుగా మార్చారు. “ప్రెసిడెన్షియల్ డైరెక్టివ్ 2017-447 ప్రకారం, ప్రభుత్వం కార్ల స్మగ్లర్ల పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉందని తెలపడం కోసం వీటిని ఇలా నాశనం చేయవలసిందే’’ అని అధ్యక్షుడు రోడ్రిగో రో డ్యూటెర్టే పునరుద్ఘాటించారు. 

దేశంలోకి అక్రమ రవాణా చేసిన లగ్జరీ కార్లను ఇలా తుక్కుగా మార్చడం ఇది రెండో సారి. గతంలో బీఎమ్‌డబ్ల్యూ జెడ్ 1, ఫెరారీ 360 స్పైడర్, లంబోర్ఘిని గల్లార్డోతో సహా 17 వాహనాలను ఫిబ్రవరి 9 న బ్యూరో ఆఫ్ కస్టమ్స్ తుక్కుతుక్కు చేసింది. ఇది ఇక్కడ చాలా సాధారణ విషయం. గతంలో ఇలా తుక్కుగా మార్చిన వాటిలో రెనాల్ట్ 5 టర్బో, మెర్సిడెస్ ఎస్‌ఎల్ 55 ఏఎమ్‌జి, ఒపెల్ మాంటా, మసెరటి క్వాట్రోపోర్ట్, కాక లెక్కలేనన్ని లగ్జరీ కార్లు ఉన్నాయి. అయితే ప్రభుత్వ చర్యలపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతుంది. ఇంత ఖరీదైన కార్లను ఇలా ధ్వంసం చేసే బదులు ప్రభుత్వమే వేలం వేసి.. వచ్చిన డబ్బును మంచి పనుల కోసం వాడవచ్చు కదా అంటున్నారు జనాలు. 

చదవండి: ఆయన లగ్జరీ చూస్తే.. బిలియనీర్లకు కూడా షాకే!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top