ఒక్క​ వైన్‌ బాటిల్‌కు రూ.7 కోట్లు, ఎందుకంత ధర?

London: Wine Went To Space For Sale With $1 Million Price Tag - Sakshi

లండన్‌: సాధారణంగా మద్యం ధర తయారు చేసే కంపెనీ, అది తాగితే ఎక్కే కిక్కు వంటి అంశాలను తీసుకొని వాటి రేటుని ఖరారు చేస్తారు. ఈ క్రమంలో కొన్ని మద్యం బాటిల్‌ వందలకే దొరికితే , మరి కొన్ని వేల రూపాయలకు లభిస్తుంది. అదే విదేశి సరుకు కావాలంటే లక్షలు కూడా వెచ్చించాల్సి ఉంటుంది. వీటన్నింటిని తలదన్నే విధంగా ఓ మద్యం బాటిల్‌ విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అంత ధర ఎందుకో?
ఎందుకంటే అది అంతరిక్షంలో పులియబెట్టిన వైన్‌. దాని ధర కూడా అందనంత ఎత్తులో ఉంటుంది మరి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఏడాదికిపైగా గడిపిన ఒక ఫ్రెంచ్‌ వైన్‌ బాటిల్‌ను క్రిస్టీస్‌ సంస్థ వేలానికి పెట్టింది. ఇది 10 లక్షల డాలర్లు (దాదాపు రూ.7.37 కోట్లు) పలకొచ్చని వారు భావిస్తున్నారు. ఈ సీసా పేరు ‘పెట్రస్‌ 2000’. 2019 నవంబరులో అంతరిక్షంలోకి పంపిన 12 వైన్‌ సీసాల్లో ఇది ఒకటి. భూమికి వెలుపల సేద్యానికి అవకాశాలపై పరిశోధనలో భాగంగా ప్రైవేటు అంకుర పరిశ్రమ ‘స్పేస్‌ కార్గో అన్‌లిమిటెడ్‌’ వీటిని అక్కడికి పంపింది. 14 నెలల తర్వాత వాటిని భూమికి రప్పించింది.

ఫ్రాన్స్‌లోని బోర్డోలో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ వైన్‌ అండ్‌ వైన్‌ రీసెర్చ్‌లో పరిశోధకులు ఈ బాటిల్‌ పై రుచి పరీక్షలు కూడా నిర్వహించారు. భూమిపై అంతేకాలం పాటు పులియబెట్టిన వైన్‌తో దీన్ని పోల్చి చూడగా రుచిలో రెండింటి మధ్య వైరుధ్యం ఉందని చెప్పారు. రోదసిలోకి వెళ్లొచ్చిన పానీయం మృదువుగా, సువాసనభరితంగా ఉందన్నారు. అంతరిక్షంలో కొన్నాళ్లు ప్రత్యేక వాతావరణంలో ఉన్న ఈ వైన్‌ ‘పరిపక్వానికి’ వచ్చిందని క్రిస్టీస్‌ వైన్‌ అండ్‌ స్పిరిట్స్‌ విభాగం డైరెక్టర్‌ టిమ్‌ టిప్‌ట్రీ తెలిపారు. ప్రస్తుతం ఈ సీసా ధర పెరిగిపోయిందని చెప్తున్నారు.

( చదవండి: ఈ ఫోటో ఖరీదు రూ.3.7 కోట్లు.. ఎందుకింత రేటు )

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top