లెబనాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పొడిగింపు | Lebanon Israel Ceasefire Extended By 45 Days US | Sakshi
Sakshi News home page

లెబనాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పొడిగింపు

May 16 2026 1:21 AM | Updated on May 16 2026 1:24 AM

Lebanon Israel Ceasefire Extended By 45 Days US

వాషింగ్టన్: సరిహద్దుల్లో తాజా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటికీ, లెబనాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 45 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. అమెరికా జరిపిన కీలక మధ్యవర్తిత్వ చర్చల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది.

"సరిహద్దుల్లో మరింత పురోగతిని సాధించేందుకు వీలుగా.. ఏప్రిల్ 16 నాటి శత్రుత్వాల నిలిపివేత (కాల్పుల విరమణ) ఒప్పందాన్ని మరో 45 రోజుల పాటు పొడిగించాలని నిర్ణయించాం" అని యూఎస్ విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగోట్ వెల్లడించారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఈ తాత్కాలిక గడువు ఆదివారంతో ముగియాల్సి ఉండగా, తాజా నిర్ణయంతో ఊరట లభించింది.

శాశ్వత శాంతి వైపు అడుగులు..
రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక శాంతిని నెలకొల్పేందుకు అమెరికా ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా తదుపరి చర్యలు ఇలా ఉండనున్నాయి..

మే 29న రెండు దేశాల సైనిక ప్రతినిధులతో పెంటగాన్ (అమెరికా రక్షణ శాఖ) ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. జూన్ 2, 3 తేదీల్లో ఇరు దేశాల మధ్య శాశ్వత రాజకీయ ఒప్పందాన్ని కుదుర్చుకునే లక్ష్యంతో అమెరికా విదేశాంగ శాఖ ఉన్నత స్థాయి చర్చలు జరపనుంది.

"ఈ చర్చలు ఇరు దేశాల మధ్య శాశ్వత శాంతికి దారితీస్తాయని మేము ఆశిస్తున్నాము. ఒకరి సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను మరొకరు పూర్తిగా గౌరవించుకుంటూ.. భాగస్వామ్య సరిహద్దు వెంబడి నిజమైన రక్షణను ఏర్పాటు చేసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం" అని టామీ పిగోట్ ఆశాభావం వ్యక్తం చేశారు.

కొనసాగుతున్న ఉద్రిక్తతలు

మరోవైపు చర్చలు జరుగుతున్న సమయంలోనే, ఇజ్రాయెల్ రక్షణ దళాలు లెబనాన్‌లోని పలు లక్ష్యాలపై మళ్లీ దాడులు చేశాయి. అయినప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు ఈ కాల్పుల విరమణ అమలులోనే ఉందని భావిస్తున్నాయి.

కాగా, ఇరాన్‌కు సంఘీభావంగా తమపై దాడులు చేస్తున్న షియా సాయుధ బృందం 'హిజ్బుల్లా'ను లక్ష్యంగా చేసుకునే తాము ఈ దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. అయితే వాషింగ్టన్‌లో జరుగుతున్న ఈ శాంతి చర్చల్లో హిజ్బుల్లా భాగస్వామిగా లేదు.

Advertisement
 
Advertisement
Advertisement