రష్యాలో కలకలం.. భారీగా డ్రోన్ దాడులు.. నలుగురి మృతి | At least four killed in Ukrainian drone attacks on Russia | Sakshi
Sakshi News home page

రష్యాలో కలకలం.. భారీగా డ్రోన్ దాడులు.. నలుగురి మృతి

May 17 2026 5:14 PM | Updated on May 17 2026 5:46 PM

At least four killed in Ukrainian drone attacks on Russia

మాస్కో సహా రష్యాలోని పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడులు చేసింది. దీంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడాది వ్యవధిలో రష్యాపై జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదేనని అధికారులు వివరించారు. ఆదివారం రష్యా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మాస్కోలో ముగ్గురు మృతిచెందగా, ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోని బెల్గొరోడ్‌లో మరో వ్యక్తి చనిపోయాడు.

మాస్కో గవర్నర్ ఆండ్రే వోరోబ్యోవ్ తెలిపిన వివరాల ప్రకారం.. నగర ఉత్తర భాగంలోని ఖిమ్కిలో ఓ ఇంటిపై డ్రోన్ దాడి జరగగా ఓ మహిళ మృతి చెందింది. శిథిలాల కింద మరో బాధితుడు ఉన్నాడని తెలుస్తోంది. మైటిష్చి జిల్లాలోని పొగొరెల్కి గ్రామంలో మరో ఇద్దరు చనిపోయినట్లు ఆయన తెలిపారు. దాడుల్లో అపార్ట్‌మెంట్ భవనాలు, మౌలిక సదుపాయ కేంద్రాలు దెబ్బతిన్నాయని వోరోబ్యోవ్ తెలిపారు.

మాస్కో మేయర్ సెర్గెయ్ సోబ్యానిన్‌ను ఉటంకిస్తూ రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మాస్కోను లక్ష్యంగా చేసుకున్న 81 డ్రోన్లను రాత్రికిరాత్రే గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి. మాస్కో చమురు శుద్ధి కేంద్రం సమీపంలో కొందరు గాయపడ్డారు. శుద్ధి కేంద్రం పనులు ఆగలేదని, 3 ఇళ్లు దెబ్బతిన్నాయి.

రష్యా రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ 556 డ్రోన్లను అడ్డుకున్నారు. మాస్కోలోని అతిపెద్ద షెరెమెత్యేవో విమానాశ్రయం పరిధిలో డ్రోన్ శకలాలు పడినప్పటికీ ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ యుద్ధం ముగింపు దశకు చేరవచ్చని సూచించిన తర్వాత ఈ దాడులు జరిగాయి. గత వారం ట్రంప్ మాట్లాడుతూ యుద్ధం ఆపేందుకు రష్యా, ఉక్రెయిన్‌ త్వరలో ఒప్పందానికి వస్తాయని తాను నమ్ముతున్నట్లు చెప్పారు.

ఇదే సమయంలో ఉక్రెయిన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై రష్యా దాడులు కొనసాగాయి. ఖార్కివ్ ప్రాంతంలో గత 24 గంటల్లో 15 ప్రాంతాలను రష్యా బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయని, ఏడుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.

దక్షిణ ఖెర్సోన్ ప్రాంతంలో శనివారం ఉదయం ఇన్హులెట్స్ గ్రామంపై రష్యా డ్రోన్ పేలుడు పదార్థాలు వదలగా 36 ఏళ్ల వ్యక్తి మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement