కీవ్‌పై మరోసారి పేట్రేగిన రష్యా | Kyiv hit by blasts as Russia strikes cities across Ukraine | Sakshi
Sakshi News home page

కీవ్‌పై మరోసారి పేట్రేగిన రష్యా

Jan 15 2023 5:56 AM | Updated on Jan 15 2023 5:56 AM

Kyiv hit by blasts as Russia strikes cities across Ukraine - Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ శనివారం ఉదయం భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. డ్నిప్రొవ్‌స్కీ ప్రాంతంలోని కీలకమైన మౌలిక వసతులే లక్ష్యంగా రష్యా ఈ దాడులకు ఒడిగట్టినట్లు భావిస్తున్నామని ఉక్రెయిన్‌ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. క్షిపణి దాడులతో పలు ప్రాంతాల్లో 18 వరకు భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల మంటలు లేచాయి. ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొంది. కీవ్‌పై జనవరి ఒకటో తేదీ తర్వాత రష్యా దాడులు జరపడం ఇదే ప్రథమం.

అంతకుముందు ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్‌లోని పారిశ్రామిక ప్రాంతంపై రష్యా రెండు ఎస్‌–300 క్షిపణులను ప్రయోగించిందని ఆ ప్రాంత గవర్నర్‌ తెలిపారు. కీలక నగరం సొలెడార్‌ తమ అధీనంలోకి వచ్చిందంటూ రెండు రోజుల క్రితం రష్యా ప్రకటించగా, ఉక్రెయిన్‌ కొట్టిపారేసిన విషయం తెలిసిందే.  రాజధాని కీవ్, ఇతర నగరాలను లక్ష్యంగా చేసుకొని రష్యా క్షిపణి దాడులకు తెగబడుతుండడంతో ఉక్రెయిన్‌కు అండగా నిలవడానికి బ్రిటన్‌ ముందుకొచ్చింది.

ట్యాంకులు, శతఘ్ని వ్యవస్థలను ఉక్రెయిన్‌కి పంపిస్తామని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ శనివారం నాడు హామీ ఇచ్చారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో సునాక్‌ మాట్లాడారు. అనంతరం బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఛాలెంజర్‌ 2 ట్యాంకులు, ఇతర శతఘ్ని వ్యవస్థ సాయంగా అందిస్తామని సునాక్‌ హామీ ఇచ్చినట్లు వెల్లడించింది. అయితే ఎన్ని ట్యాంకులు పంపిస్తారో, ఎప్పటిలోగా అవి ఉక్రెయిన్‌ చేరుకుంటాయో  వెల్లడించలేదు. బ్రిటీష్‌ ఆర్మీ చాలెంజర్‌ 2 ట్యాంకులు నాలుగు వెంటనే పంపిస్తారని, మరో ఎనిమిది త్వరలోనే పంపిస్తారంటూ బ్రిటన్‌ మీడియా తెలిపింది. ఉక్రెయిన్‌లో మౌలికసదుపాయాలను లక్ష్యంగా చేసుకొని రష్యా దాడులకు తెగబడుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement