బహిరంగంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న బైడెన్‌

Joe Biden Publicly Receives First Covid Vaccine Shot - Sakshi

ఫైజర్‌ బయో ఎన్‌టెక్‌ మొదటి‌ కోర్స్‌‌ తీసుకున్న బైడెన్‌

వాషింగ్టన్‌: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ మాట  నిలబెట్టుకున్నారు. ప్రజల మధ్యలో కరోనావైరస్‌ వ్యాక్సిన్‌ తీసుకుంటాను అన్న బైడెన్‌ దాన్ని నిజం చేసి చూపారు. బైడెన్‌ సోమవారం క్రిస్టియానాకేర్‌ ఆస్పత్రిలో ప్రజల సమక్షంలో ఫైజర్‌ బయోఎన్‌టెక్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఫస్ట్‌ డోస్‌ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పుడు ప్రజలు ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా దాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఇలా ప్రజల సమక్షంలో వ్యాక్సిన్‌ తీసుకున్నాను’ అన్నారు. క్రిస్టియానాకేర్ ఆసుపత్రిలో నర్సు ప్రాక్టీషనర్, ఎంప్లాయీ హెల్త్ సర్వీసెస్ హెడ్ తబే మాసా బైడెన్‌కి వ్యాక్సిన్‌ వేశారు. నూతన అధ్యక్షుడి భార్య డాక్టర్ జిల్ బిడెన్ ఇప్పటికే వ్యాక్సిన్ మొదటి కోర్సును తీసుకున్నారు. బైడెన్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడానికి వెళ్లగా ఆమె కూడా హాజరయ్యారు. (చదవండి: వ్యాక్సిన్‌ పంపిణీ.. మార్గదర్శకాలు)

ఈ నేపథ్యంలో బైడెన్‌ "ఈ రోజు నేను కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకున్నాను. ఈ వ్యాక్సిన్‌ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన శాస్త్రవేత్తలు, వైద్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేము మీకు చాలా రుణపడి ఉన్నాము. ఇక అమెరికా ప్రజలు ఒక విషయం తెలుసుకొండి. దీనిలో భయపడాల్సిన విషయం ఏం లేదు. ఇక జనాలందరికి సరిపడా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన నాడు మీరు దాన్ని తీసుకోవడానకి సిద్ధంగా ఉండండి" అని ట్విట్టర్‌ వేదికగా జనాలను కోరారు. బైడెన్‌ చర్యని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ ప్రశంసించారు. నాయకుడు అంటే ఇలా ఉండాలి అంటూ మెచ్చుకున్నారు. ఇక వచ్చే వారం కమలా బహిరంగంగా వ్యాక్సిన్‌ తీసుకోనున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top