జెఫ్‌ బెజోస్‌కు ఊహించని ఎదురు దెబ్బ! | Sakshi
Sakshi News home page

Jeff Bezos: ఊహించని పరిణామం, ప్రముఖులు ఫైర్‌

Published Wed, Jul 21 2021 5:02 PM

Jeff Bezos Thanked Employees and customers For Space Trip, Backlash - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: రోదసీ యాత్ర పూర్తి చేసుకుని ఫుల్‌ ఖుషీగా ఉన్న ప్రపంచ కుబేరుడు జెఫ్‌ బెజోస్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. తన స్పేస్‌ టూర్‌ విజయవంతమైనందుకు అమెజాన్‌ ఉద్యోగులకు, కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు బెజోస్‌. ఇందులో ఇబ్బంది ఏముంది అంటారా? ఇక్కడే ఉంది ట్విస్ట్‌. ప్రపంచ బిలియనీర్‌గా ఉన్నా బెజోస్‌ పన్నులు చెల్లించకుండా..ప్రజల సొమ్ముతో టూర్‌కు వెళ్లొచ్చావు అన్నట్టుగా రాజకీయ ప్రముఖులు, నెటిజన్ల నెగిటివ్‌ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

అమెజాన్‌ సంస్థ బ్లూ ఆరిజిన్ ఆధ్వర్యంలో రాకెట్‌ నిర్మాణం, అంతరిక్ష ప్రయాణం దీని ఖర్చంతా మీరే చెల్లించారంటూ స్వయంగా బెజోసే వెల్లడించడంతో  ఆయనకు దిమ్మ తిరిగే రెస్పాన్స్‌ వచ్చింది. ప్రతి అమెజాన్ ఉద్యోగికి, ప్రతి అమెజాన్ కస్టమర్‌కూ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మీరే వీటన్నింటికీ చెల్లించారు" అని బెజోస్ తన టూర్‌ ముగిసిన తరువాత ఏర్పాటు చేసిన సమావేశంలో పేర్కొన్నారు. సీరియస్లీ.. మీ అందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు అని ఆయన తెలిపారు. 
 
తక్కువ జీతాలు, దారుణమైన, అమానవీయ ఆఫీసు వాతావరణం, కరోనా మహమ్మారి సమయంలో కూడా డెలివరీ డ్రైవర్లకు ఆరోగ్య బీమా లేకుండా అమెజాన్‌ ఉద్యోగులే ఇదంతా భరించారంటూ అమెరికా చ‌ట్ట‌స‌భ ప్ర‌తినిధి లెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్ ట్విటర్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెజాన్ తన మార్కెట్ శక్తిని దుర్వినియోగం చేస్తూ, చిన్న వ్యాపారాలను దెబ్బతీసేందుకే ఉద్యోగులు చెల్లిస్తున్నారన్నారు. ప‌న్నులు క‌ట్ట‌కుండా అమెరిక‌న్లు చెమ‌టోడ్చి సంపాదించి క‌ట్టిన ప‌న్నుల‌తోనే స్పేస్‌ టూర్‌ చేసి వచ్చారంటూ సెనేట‌ర్ ఎలిజ‌బెత్ వారెన్ ట్వీట్‌ చేశారు. కానీ అమెరికన్లకు థ్యాంక్స్ చెప్ప‌డం మాత్రం మ‌ర‌చిపోయాంటూ మండిపడ్డారు.

మరోవైపు కెన‌డాలోని న్యూడెమొక్ర‌టిక్ పార్టీ నేత జ‌గ్‌మీత్ సింగ్ కూడా  బెజోస్‌ను విమర్శిస్తూ ట్వీట్ చేశారు. 11 నిమిషాల్లో బెజోస్‌ యాత్ర ముగిసింది.  కానీ కరోనా వైరస్‌ మహమ్మారి కాలంలో ప్రతి 11 నిమిషాలకు (16 ల‌క్ష‌ల డాల‌ర్లు) మిలియన్ల డాలర్లు మూటగట్టుకుని మరింత కుబేరుడిగా అవతరించాడని వ్యాఖ్యానించారు.  అమెజాన్‌పై ఎలాంటి పన్నులు లేకుండా అనుమతించిన ప్రధాని జస్టిన్  ట్రూడో చలవే ఇదంతా అని ట్వీట్‌ చేశారు. 

కాగా బిలియనీర్‌ బెజోస్‌పై అమెరికాలో పన్ను ఎగవేత ఆరోపణలు అమెజాన్ ఉద్యోగులకు తగిన జీతాలు చెల్లించకపోడం, ప్రమాదకరమైన పని పరిస్థితులు, భోజన, వాష్‌రూం విరామాలను కూడా తీసుకోనీయకుండా వేధింపులకు పాల్పడుతోందంటూ చెలరేగిన విమర్శల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.  జెఫ్ బెజోస్ మంగళవారం 11 నిమిషాల్లో చారిత్రాత్మక అంతరిక్ష యాత్రను విజయవంతంగా ముగించిన సంగతి తెలిసిందే. 

Advertisement
Advertisement