ఆస్పత్రిలో చేరిన జపాన్‌ ప్రధాని.. రాజీనామా! | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో చేరిన జపాన్‌ ప్రధాని.. రాజీనామా!

Published Mon, Aug 24 2020 8:19 AM

Japan Prime Minister Shinzo Abe Entered Hospital on Monday - Sakshi

టోక్యో : జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబే అనారోగ్య సమస్యలతో సోమవారం టోక్యోలోని ఆస్పత్రిలో చేరారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారని స్థానిక మీడియా పేర్కొంది. ప్రధాని అబేకు దాదాపు ఏడున్నర గంటలు పరీక్షలు  నిర్వహించినట్లు తెలిపింది.  ప్రధాని కాన్వాయ్‌లో ఆస్పత్రికి చేరుకోవడంతో పెద్ద మొత్తంలో మీడియా అక్కడకు చేరుకుంది. కాగా షింజో అబే అనారోగ్యానికి గురవ్వడంతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. (అణు ఆయుధాలను నిషేధించండి: జపాన్‌)

అయితే అబే ఆస్పత్రిలో చేరడం ఇదేం మొదటి సారి కాదు. ఇంతకు ముందు  కూడా  అబే ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ఆస్పత్రిలో చేరారని స్థానిక మీడియా నివేదించింది. జూలై 6న అబే తన కార్యాలయంలో రక్తపు వాంతులు చేసుకున్నట్లు వీక్లీ మ్యాగజైన్‌ ప్రచురించింది. అయితే ఈ వార్తలను ప్రభుత్వం ఖండించింది. ఆయన కేవలం జనరల్‌ చెకప్‌ కోసం వచ్చినట్లు, అబే ఆరోగ్యం క్షేమంగానే ఉందని ఆర్థికమంత్రి కట్సునోబు కటో తెలిపారు. ఇదిలా ఉండగా దేశంలో ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన వ్యక్తిగా అబే రికార్డు సృష్టించారు. (చైనాకు మద్దతుపై డైలమాలో జపాన్‌..)

ఇంతకముందు తన మేనమామ ఐసాకు పేరు మీద ఉన్న ఈ రికార్డును అబే సోమవారంతో అధిగమించాడు. ఈ మైలురాయిని చేరుకున్న తరువాత అతను రాజీనామా చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే 2007లో కొంత ఆరోగ్య సమస్యల వల్ల తన పదవీకి రాజీనామా చేసి  2012లో మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఒకవేళ అబే తన పదివి నుంచి తొలగిపోతే ప్రస్తుతం ఉప ప్రధానిగా ఉన్న తారో అసో తాత్కాలికంగా ప్రధాని బాద్యతలు స్వీకరించనున్నారు. అలా కాకుండా అబే తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకుంటే ఎన్నికల అనంతరం అధికారికంగా మరొకరు ప్రధానమంత్రి అయ్యేవరకు అతను ఈ పదవిలో కొనసాగుతారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement