అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుతున్నాయనుకున్న సమయంలో మరోసారి మంటలు చెలరేగాయి. హర్ముజ్ జలసంధి పరిణామాలు, పరస్పర ఆరోపణలతో ఇరు దేశాల మధ్య టెన్షన్ పెరుగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మట్టుపెట్టేందుకు ఇరాన్ స్కెచ్ వేసిందన్న ప్రచారం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని స్వయంగా ట్రంపే వెల్లడించడం.. నాటో సదస్సు ప్రయాణంలో భద్రతా కారణాలతో విమానం మార్చుకోవడం.. వరుసగా చర్చనీయాంశాలయ్యాయి. అయితే ఈ మొత్తం పరిణామాల్లో ఇజ్రాయెల్ నిఘా సమాచారం కీలకంగా మారినట్లు తెలుస్తోంది.
తన నిఘా వ్యవస్థ ద్వారా ఈ సమాచారాన్ని అందుకున్న ఇజ్రాయెల్ వెంటనే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ట్రంప్‌కు ముప్పుపై కీలక వివరాలను అమెరికాకు అత్యవసరంగా చేరవేసిందని.. ఈ హెచ్చరికతో అమెరికా భద్రతా వ్యవస్థ అప్రమత్తమైందని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఇరాన్‌తో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇజ్రాయెల్ అందించిన నిఘా సమాచారం ట్రంప్ వైఖరిలో మార్పునకు కారణమైందా? అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ప్రక్రియపై దీని ప్రభావం పడనుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఇజ్రాయెల్ హెచ్చరిక.. అమెరికా దూకుడు?
అమెరికా మీడియా కథనాల ప్రకారం.. ఇరాన్ నుంచి ట్రంప్‌కు ముప్పు ఉందన్న సంకేతాలను అమెరికా నిఘా సంస్థలు ఇప్పటికే గుర్తించాయి. అయితే, ఒక నిర్దిష్ట హత్యా ప్రణాళికకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఇజ్రాయెల్ తాజాగా అమెరికా రక్షణ శాఖకు అందించినట్లు తెలుస్తోంది.
ఈ సమాచారాన్ని అమెరికా స్వతంత్రంగా పూర్తిస్థాయిలో ధ్రువీకరించలేదని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో.. ఇరాన్‌పై మరింత కఠిన వైఖరి అవలంబించేలా ట్రంప్‌పై ఒత్తిడి తీసుకురావడానికి ఇజ్రాయెల్ ఈ నిఘా సమాచారాన్ని ఉపయోగించిందా? అన్న చర్చ కూడా అమెరికా వర్గాల్లో సాగుతోంది. అయితే భద్రతా అంశంగా ఈ హెచ్చరికను అమెరికా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు.. ఇరాన్ కదలికలపై నిఘాను పెంచినట్లు సమాచారం.
మరోవైపు, ఈ పరిణామం అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. నేరుగా ఘర్షణకు వెళ్లకుండా పరిష్కారం కోరుతున్న ట్రంప్ వైఖరిలో ఈ హెచ్చరిక మార్పు తీసుకొస్తుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మళ్లీ దగ్గరవుతున్న ట్రంప్-నెతన్యాహు
ఇరాన్ విషయంలో ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య భిన్నాభిప్రాయాలు బహిర్గతమయ్యాయి. ఇరాన్‌పై ఒత్తిడిని కొనసాగించాలని నెతన్యాహు భావించగా.. యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, చమురు మార్కెట్లపై పడే ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని ట్రంప్ దౌత్య పరిష్కారం వైపు మొగ్గు చూపారు.
ఈ క్రమంలో లెబనాన్ పరిణామాలు, శాంతి ఒప్పందం ఆలస్యం వంటి అంశాలపై ట్రంప్ ఇజ్రాయెల్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక దశలో నెతన్యాహును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో.. ఇరు దేశాల మధ్య దూరం పెరుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అయితే, తాజాగా ట్రంప్‌కు ఇరాన్ నుంచి ముప్పు ఉందన్న నిఘా సమాచారం నేపథ్యంలో అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాల్లో మళ్లీ సాన్నిహిత్యం పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా చేపడుతున్న చర్యలు, భద్రతా పరిస్థితులపై ట్రంప్, నెతన్యాహు మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
ఇరాన్ ముప్పు నేపథ్యంలో గత విభేదాలను పక్కన పెట్టి.. రెండు దేశాలు మళ్లీ వ్యూహాత్మక సమన్వయంపై దృష్టి పెడుతున్నాయా? అన్న చర్చ ఇప్పుడు మొదలైంది.
కొత్తేం కాకపోయినా..
ట్రంప్‌కు ఇరాన్ నుంచి ముప్పు ఉందన్న ఆరోపణలు కొత్తవేమీ కాదు. ట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కీలక కమాండర్ ఖాసిం సోలైమనీ మరణించారు. ఆ ఘటన తర్వాత ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌లోని కొన్ని వర్గాలు బహిరంగంగా హెచ్చరించాయి.
ఆ తర్వాత కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లోని కొన్ని వర్గాల నుంచి హెచ్చరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇరాన్లో జరిగిన సంతాప కార్యక్రమాల్లోనూ ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు వినిపించినట్లు సమాచారం. అయితే ఇరాన్ నిజంగానే ఇలాంటి కుట్రకు పాల్పడుతోందా? లేక దౌత్య, వ్యూహాత్మక పోరాటంలో భాగంగానే ఈ ఆరోపణలు తెరపైకి వచ్చాయా? అన్నది ఇంకా స్పష్టతకు రావాల్సి ఉంది.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు వరుసగా అవరోధాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ హత్యా కుట్ర ఆరోపణలు, ఇజ్రాయెల్ నిఘా సమాచారం, అమెరికా భద్రతా చర్యలు, ఇరాన్ ప్రతిస్పందనలు.. మరోసారి పశ్చిమాసియా రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.
శాంతి దిశగా సాగాల్సిన చర్చలకు తాజా పరిణామాలు మరో పరీక్షగా మారాయి. ట్రంప్-ఇరాన్ ఘర్షణలో తదుపరి అడుగు ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.


