
ఈ వారంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం
కైరో: గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల ప్రధాన లక్ష్యాలుగా సోమవారం ఈజిప్టు రాజధాని కైరోలో చర్చలు మొదలుకానున్నాయి. పరోక్షంగా జరిగే ఈ చర్చల కోసం ఇజ్రాయెల్, హమాస్ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ వారంలోనే కాల్పుల విరమణ, బందీల విడుదల మొదలుకానుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 20 సూత్రాల కాల్పుల విరమణ ప్రతిపాదనలపై ఇజ్రాయెల్‌తోపాటు హమాస్ సానుకూలంగా స్పందించడం తెల్సిందే. హమాస్ చెర నుంచి ఇజ్రాయెలీలకు విముక్తి కల్పించడం, బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలోని పాలస్తీని యన్లను విడుదల చేయడంపైనే సోమవారం ప్రధానంగా చర్చలు జరపనున్నారు. ఈ చర్చల్లో అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ సైతం పాలుపంచుకుంటారని ఈజిప్టు విదేశాంగ శాఖ తెలిపింది.
బందీల విడుదల, గాజాలో 2025 ఆగస్ట్‌లో ఉన్న ప్రాంతాల్లోకి ఇజ్రాయెల్ బలగాలను ఉపసంహరించుకోవడంపై అంగీకారం కుదిరిన నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందానికి అతి సమీపంలో ఉన్నట్లేనని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు. కాల్పుల విరమణ దిశగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై ముస్లిం మెజారిటీ కలిగిన 8 దేశాలు ఓ ఉమ్మడి ప్రకటనలో హర్షం వ్యక్తం చేశాయి.
పాలస్తీనా అథారిటీకి గాజాను అప్పగించాలని, గాజాను వెస్ట్‌బ్యాంక్‌లో విలీనం చేయాలని, గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఆ దేశాలు డిమాండ్ చేశాయి. ఈ చర్యలన్నిటి కంటే ముందుగా బందీల విడుదల, అందుకు బదులుగా ఖైదీలకు విముక్తి జరగాల్సి ఉందన్నారు. ఇలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజాపై బాంబింగ్‌ను నిలిపివేయాలని ఇజ్రాయెల్‌ను కోరిన తర్వాతా దాడులు కొనసాగినట్లు సమాచారం.
గాజా నగరం, రఫాలపై ఆదివారం జరిగిన దాడుల్లో కనీసం 12 మంది చనిపోయారని వివిధ ఆస్పత్రుల సిబ్బంది చెప్పారు. కాల్పుల విరమణ ఇంకా మొదలుకానందున, గాజాలో ప్రస్తుతానికి బాంబింగ్‌ను పూర్తిగా ఆపేయలేదని ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రతినిధి మీడియాకు చెప్పారు. అదేవిధంగా, చర్చలను జాప్యం చేసేందుకు హమాస్ చేసే ప్రయత్నాలపై ఓ కన్నేసి ఉంచామని కూడా ఆమె తెలిపారు.