ఇరాన్‌ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాల్లో భారీగా పెరగనున్న పెట్రోల్‌ ధరలు?! | Iran Imposes Hefty Transit Fees On Ships In Strait Of Hormuz Amid Rising Tensions, More Details Inside | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాల్లో భారీగా పెరగనున్న పెట్రోల్‌ ధరలు?!

Mar 23 2026 8:54 AM | Updated on Mar 23 2026 9:20 AM

Iran Imposes 2 Million Toll Per Ship in Strait of Hormuz

టెహ్రాన్‌: హర్మూజ్‌ జలసంధిని తెరవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో ఇరాన్‌ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రపంచ నౌకా రవాణాకు అత్యంత ప్రాధాన్యం కలిగిన హర్మూజ్‌ జలసంధిపై తన నియంత్రణను బలోపేతం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా, ఇరాన్ కొన్ని నౌకల నుండి భారీ రవాణా రుసుములు వసూలు చేయాలని నిర్ణయించింది. ఇరాన్‌ నిర్ణయంతో ప్రపంచ దేశాల్లో పెట్రోల్‌,డీజిల్‌తో పాటు ఇతర సహజ వనరుల  ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. 

అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. సాధారణంగా గల్ఫ్ దేశాల నుంచి చమురు నౌకలు జలసంధి గుండా ఉచితంగా ప్రయాణించే హక్కు  ఉంది.  కానీ తాజా పరిణామాల ప్రకారం, రానున్న రోజుల్లో ఈ స్వేచ్ఛా ప్రయాణం సాధ్యం కాకపోవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.

ఇరాన్ ప్రభుత్వం హర్మూజ్‌ జలసంధి గుండా వెళ్లే కొన్ని నౌకల నుండి 2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.18.8 కోట్లు) వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ భారీ సుంకం ఇప్పటికే అమలు చేయబడిందని, ఇది ఆ కీలక జలమార్గాన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న కొత్త విధానానికి నిదర్శనమని పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ సభ్యుడు అలయెద్దీన్ బరూజెర్ది తెలిపారు.

కొత్త సుప్రీం లీడర్ చర్యలు
బరూజెర్ది ప్రకారం, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇతర దేశాల జోక్యం లేకుండా పాలన సాగించేలా, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది.

రవాణా రుసుము ఉద్దేశ్యం
“జలసంధిని దాటే కొన్ని నౌకల నుండి రవాణా రుసుముగా 2 మిలియన్ డాలర్లు వసూలు చేయడం ఇరాన్ పట్టు సాధించే ప్రయత్నం కనబడుతోంది. యుద్ధానికి ఖర్చులు ఉంటాయి కాబట్టి సహజంగానే మనం హర్మూజ్‌ జలసంధి గుండా వెళ్లే ఓడల నుండి రవాణా రుసుములు వసూలు చేయాలి’అని బరూజెర్ది వ్యాఖ్యానించారు.

ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20శాతం హర్మూజ్‌  జలసంధి గుండా జరుగుతుంది.ఇది పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ మధ్య ఉన్న సన్నని మార్గం. గల్ఫ్ దేశాల (సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఇరాక్, ఖతార్) నుంచి చమురు నౌకలు ఈ మార్గం గుండా ప్రపంచ దేశాలకు చేరతాయి. ఇప్పుడీ మార్గం ద్వారా వెళ్లే కొన్ని నౌకల నుంచి రవాణ రుసుము వసూలు చేయడం వల్ల సంబంధిత దేశాల్లో పెట్రోల్‌,డీజిల్‌తో పాటు ఇతర సహజ వనరుల ధరలు అమాంతం పెరగనున్నాయి. రవాణా ఖర్చులు పెరగడం వల్ల వాణిజ్య వ్యయం అధికమవుతుంది. ప్రపంచ మార్కెట్లలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement