ఇరాన్‌ నిర్ణయంపై ప్రపంచమంతా గగ్గోలు | Iran Charging Ships 2 Million For Passage Through Strait Of Hormuz Amid War, Check More Details Inside | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ నిర్ణయంపై ప్రపంచమంతా గగ్గోలు

Mar 23 2026 8:59 AM | Updated on Mar 23 2026 9:28 AM

Iran charging ships 2 million for passage through Strait of Hormuz

టెహ్రాన్/న్యూఢిల్లీ: ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయలాంటి  ‘హర్మూజ్ జలసంధి' (Strait of Hormuz) ఇప్పుడు ఇరాన్ ‘దందా’కు అడ్డాగా మారింది. యుద్ధం కారణంగా మూతపడిన ఈ మార్గంలో ప్రయాణించాలంటే ఒక్కో సరుకు రవాణా నౌక నుంచి ఇరాన్ ఏకంగా 2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.18,76,57,000) వసూలు చేస్తోంది. ఈ విషయాన్ని ఇరాన్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడు స్వయంగా వెల్లడించడం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. 

యుద్ధ ఖర్చుల కోసమే ఈ ‘ఫీజు’
ఇజ్రాయెల్, అమెరికా కూటమితో యుద్ధం ముదురుతున్న వేళ ఇరాన్ తన అధికారాన్ని చాటుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘యుద్ధం అంటే ఖర్చుతో కూడుకున్న పని. అందుకే హర్మూజ్ గుండా వెళ్లే నౌకల నుంచి ట్రాన్సిట్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించాం’ అని ఇరాన్ జాతీయ భద్రతా కమిటీ సభ్యుడు అలద్దీన్ బ్రౌజెర్డి స్పష్టం చేశారు. ఇది ఇరాన్ శక్తికి నిదర్శనమని ఆయన అభివర్ణించారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దెబ్బ
మార్చి మొదటి వారం నుండి హర్మూజ్ జలసంధి దాదాపుగా మూతపడింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే 20 శాతం చమురు, ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) ఈ జలమార్గం గుండానే వెళ్లాలి. రవాణా నిలిచిపోవడంతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతర్జాతీయ ఆంక్షల నడుమ ఉన్న ఇరాన్‌కు ఇలా కోట్లలో నగదు చెల్లించడం షిప్పింగ్ కంపెనీలకు పెద్ద సవాలుగా మారింది.

ట్రంప్ అల్టిమేటం.. ఇరాన్ ప్రతిసవాల్
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యవహారంపై ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 48 గంటల్లోగా జలసంధిని పూర్తిగా తెరవాలని, లేనిపక్షంలో ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులు చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. దీనికి ఇరాన్ కూడా ధీటుగానే స్పందించింది. తమపై దాడులు జరిగితే మధ్యప్రాచ్యంలోని కీలక ఇంధన కేంద్రాలను ధ్వంసం చేస్తామని, జలసంధిని శాశ్వతంగా మూసివేస్తామని హెచ్చరించింది.

భారత నౌకలకు ఊరట
అయితే ఇరాన్ తన శత్రు దేశాల నౌకలను మాత్రమే అడ్డుకుంటామని చెబుతోంది. ఇప్పటికే భారత్‌కు చెందిన రెండు ఎల్పీజీ నౌకలకు ఇరాన్ అనుమతినిచ్చింది. పాకిస్తాన్ ఆయిల్ ట్యాంకర్ కూడా సురక్షితంగా ప్రయాణించింది. కానీ, గడిచిన కొద్ది రోజుల్లో జరిగిన దాడుల్లో ఒక భారతీయ నావికుడు మరణించడం ఆందోళన కలిగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement