నిస్సహాయస్థితిలో భారత అమ్మాయిలు.. బంకర్‌లో దాక్కుని కాపాడండి అంటూ.. వీడియో

Indian Students In Ukraine Send SOS Video For Evacuation - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రష్యా సైనిక దాడి కారణంగా ఉక్రెయిన్‌లో భయానక వాతావరణం చోటుచేసుకుంది. ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌తో కాలం గడుపుతున్నారు. తాజాగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఇద్దరు భారతీయ అమ్మాయిలు వారి దీన స్థితిని వీడియోలో ప్రపంచానికి తెలిపారు. 24 గంటలుగా తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక అల్లాడిపోతున్నామంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో చూశాక అయినా భారత ప్రభుత్వం ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమను స్వదేశానికి తీసుకువెళ్లాలని అభ‍్యర్థించారు. 

అయితే, రష్యా దాడుల నేపథ్యంలో కర్నాటకలోని బెంగళూరుకు చెందిన ఇద్దరు విద్యార్థినిలు తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతంలో చిక్కుకుపోయారు. బాంబుల దాడుల కారణంగా వారు ఓ బంకర్‌లో దాక్కున్నట్టు తెలిపారు. ఈ సందర్బంగా వారి నిస‍్సహాయ స్థితి గురించి ఓ వీడియోను రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. వీడియోలో మేఘన, రక్ష మాట్లాడుతూ.. దాడుల నేపథ్యంలో తాము ఓ బంకర్‌లో దాక్కున్నామని అన్నారు. 24 గంటలుగా తమకు తినడానికి తిండి, తాగడానికి నీరు, సరైన వెంటిలేషన్‌ లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఉక్రెయిన్‌లో 15వేల మందికి పైగా విద్యార్థులు చిక్కుకున్నారని దయచేసి తమకు సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఉక్రెయిన్‌లోని భారతీయ రాయబార కార్యాలయ అధికారులను అభ‍్యర్థించారు. ఈ క‍్రమంలోనే భారత ఉన్నతాధికారుల నుంచి తమకు ఎలాంటి సాయం అందడంలేదని వారు పేర్కొన్నారు. తమ కోసం ప్రత్యేక విమానం ఏదీ రాలేదని, వీలైనంత త్వరగా తమకు సాయం అందించాలని వారు వేడుకున్నారు. 

ఈ వీడియోను కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌లో పోస్టూ చేస్తూ.. ఉక్రెయిన్‌లో విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. భారత విద్యార్థులను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావాలని భారత ప్రభుత్వానికి సూచించారు. విద్యార్థుల కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top