ట్రంప్‌కి సైతం వణుకుపుట్టించే స్థాయికి వివేక్‌ రామస్వామి | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కి సైతం వణుకుపుట్టించే స్థాయికి వివేక్‌ రామస్వామి

Published Thu, Sep 28 2023 7:28 PM

Indian merican Presidential Aspirant Vivek Ramaswamy All About You Know - Sakshi

భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో దూసుకెళ్తున్నారు. రిపబ్లికన్‌ పార్టీ తరపున రేసులో ఉన్న ఆయన... ఇప్పుడు రెండో స్థానంలో ఉన్నారు. బయోటిక్‌ రంగంలో అమెరికాలో సంచలనం సృష్టించిన రామస్వామి... మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కూడా వణుకుపుట్టించే స్థాయికి ఎలా ఎదిగారు?

రిపబ్లిక్‌ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో  భారత సంతకి అభ్యర్థి  వివేక్‌ రామస్వామి దూసుకెళ్తున్నారు. డొనాల్డ్‌ ట్రంప్ తర్వాతి స్థానంలోకి చేరుకొన్నారు ఆయన.  ఈమధ్యనే జరిగిన జీవోపీ పోల్స్‌లో  ఇది వెల్లడైంది. ఇంతకుముందు మూడో ప్లేస్‌లో ఉన్న భారత సంతతికి చెందిన రామస్వామి తాజాగా రెండో స్థానానికి చేరుకున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది.

మరోవైపు... అధ్యక్ష రేసు కోసం జరుగుతున్న ప్రైమరీ పోల్స్‌లో 39 శాతం మంది డొనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు ఇస్తున్నారు. రామస్వామికి 13 శాతం మంది సపోర్ట్‌ చేస్తున్నారు.  దీన్నిబట్టి  ట్రంప్‌కు రామస్వామే ముఖ్య పోటీదారుగా నిలిచే అవకాశం ఉందంటున్నారు. భారత సంతతికి చెందిన మరో అభ్యర్థి నిక్కీహెలీ 12 శాతం ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. 

ఇప్పటి వరకు ట్రంప్‌కు  ప్రధాన పోటీదారుగా ఉన్న ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీశాంటిస్ రెండు స్థానాలు తగ్గి అనూహ్యంగా ఐదో స్థానానికి పడిపోయారు. న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ 11 శాతం మద్దతుతో నాలుగో స్థానంలో ఉన్నారు. మరోవైపు...వచ్చే ఏడాది జరగనున్న  అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న 75 శాతం మందిని తొలగిస్తానని అనూహ్య ప్రకటన చేశారు రామస్వామి. అంతేకాదు FBI లాంటి అనేక సంస్థలను మూసేస్తాని కూడా  స్పష్టంచేశారు. వచ్చే నాలుగేళ్లలో  ఉద్యోగుల్ని తగ్గించడమే తన లక్ష్యమని కూడా చెప్పారు రామస్వామి.అంతేకాదు.. హెచ్‌-1 వీసా విధానంలో సంస్కరణలు తీసుకొస్తానని కూడా ఆయన పేర్కొన్నారు.

అమెరికా ఫెడరల్ విభాగంలో  సుమారు 22 లక్షల 50 వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో 75 శాతం మంది తొలగించడమంటే 16 లక్షల మందికి ఉద్వాసన పలనకడమేనన్నమాట. అంత ఎక్కువ సంఖ్యలో  ఉద్యోగుల్ని తీసేస్తే  బడ్జెట్లో వేల కోట్ల డాలర్లు ఆదా అవుతాయి. కానీ,  ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన కార్యకలాపాలు  మూతపడే అవకాశముందని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు... ఈమధ్య జరిగిన ప్రైమరీ పోటీల్లో పలు కీలక ప్రతిపాదనలు చేసిన వివేక్ రామస్వామి చాలా మంది మద్దతు సంపాదించారు. తర్వాత నిర్వహించిన పోల్లో 504 మంది స్పందన తెలియజేస్తే... అందులో 28 శాతం మంది రామస్వామిని ఉత్తమంగా పేర్కొన్నారు. 

విదేశీ వ్యవహారాల విషయానికి వస్తే ...రష్యా విషయంలో విభిన్న వైఖరిని ప్రకటించారు రామస్వామి. అమెరికాకు ప్రధాన అడ్డంకిగా మారిన చైనా ను ఎదుర్కొనే సమయంలో రష్యా చాలా కీలకమైందని ఆయన అభిప్రాయపడ్డారు. మాస్కోను ఎట్టి పరిస్థితుల్లో బీజింగ్ పక్షాన చేరనీయకూడదన్నారు. తాను ఎన్నికల్లో గెలిచి శ్వేత సౌధంలో అడుగుపెడితే ఈ లక్ష్యాన్ని సాధించేందుకు రష్యాకు మంచి డీల్‌ను ఆఫర్ చేస్తానని కూడా ప్రకటించారు రామస్వామి. మాస్కోతో ఆర్థిక సంబంధాలను పునరుద్ధరిస్తానన్నారు. అప్పుడు చైనాతో అవసరం మాస్కోకు తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు రామస్వామి.  

మరోవైపు.. రిపబ్లిక్‌ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్‌ ట్రంప్‌ ముందంజలోనే ఉన్నారు. కానీ ఆయనకు భారత సంతతికి చెందిన అభ్యర్థుల నుంచి  చివరిదాకా గట్టిపోటీ తప్పేలాలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధ్యక్ష ఎన్నికల నాటికి  పరిస్థితులు మారే అవకాశముందని కూడా అంచనావేస్తున్నారు. షెడ్యూల్‌ ప్రకారం అమెరికా అధ్యక్ష ఎన్నికలు వచ్చే ఏడాది నవంబరులో జరగుతాయి.  గత అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ చేతిలో ట్రంప్‌ ఓడిపోయారు.  ఆసమయంలోనే తాను 2024 నాటి అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరపున మళ్లీ పోటీచేస్తానని ప్రకటించారు ట్రంప్‌. 

ఇక.. రామస్వామి పూర్వీకులు భారత్‌కు చెందిన వారు. కేరళలోని పాలక్కాడ్‌ జిల్లా నుంచి అమెరికా వలసవెళ్లిన గణపతి రామస్వామి, గీతా రామస్వామికి  1985 ఆగస్టు 9న జన్మించారు వివేక్‌ రామస్వామి. హార్వర్డ్‌  నుంచి జీవశాస్త్రంలో డిగ్రీ తీసుకున్న వివేక్‌.. 2014లో రోవెంట్‌ సైన్సెస్‌ అనే సంస్థను స్థాపించారు. 2015లో అమెరికా స్టాక్‌ మార్కెట్లో భారీ ఐపీఓకు వెళ్లారు.  క్యాన్సర్‌, అల్జీమర్స్‌ లాంటి వ్యాధులకు విజయవంతంగా మందులు తయారుచేసి బయోటెక్‌ రంగంలో అమెరికాలో అతిపెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగారు. అమెరికాలోని టాప్‌ యువ బిలియనీర్లలో రామస్వామి ఒకరు. రిపబ్లికన్‌ పార్టీలో ఇప్పుడు ఆయన  కీలక వ్యక్తిగా మారారు. 

Advertisement
 
Advertisement