రెస్టారెంట్‌లో రచ్చ రచ్చ చేసిన ఫ్యామిలీ | Indian Family Accused Of Damaging Restaurant Property In Vietnam, CCTV Viral Video Sparks Outrage | Sakshi
Sakshi News home page

రెస్టారెంట్‌లో రచ్చ రచ్చ చేసిన ఫ్యామిలీ

Jun 30 2026 3:46 PM | Updated on Jun 30 2026 4:04 PM

Indian Family Accused Of Vandalising Vietnam Restaurant

వియత్నాంలోని ఓ భారతీయ రెస్టారెంట్‌లో ఓ భారతీయ కుటుంబం ప్రవర్తించిన తీరు వివాదానికి దారితీసింది. హో చి మిన్ సిటీలో ఉన్న రెస్టారెంట్‌లో ఓ​ భారతీయ కుటుంబం పలు వస్తువులను ధ్వంసం చేసింది. రెస్టారెంట్‌ సిబ్బందిని బెదిరించింది.

నగరంలోని డిస్ట్రిక్ట్ 1 పర్యాటక ప్రాంతంలో ఉన్న బాంబే బైట్స్ హెచ్‌సీఎమ్ అనే ప్రముఖ భారతీయ రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. భోజనం చేయడానికి వచ్చిన ఓ కుటుంబంలోని ఇద్దరు పిల్లలు వెళ్తున్న సమయంలో టిష్యూ పేపర్లను విసిరారు. ఆ పిల్లలు వాటిని విసరడం ఆపాలని సిబ్బంది కోరారు. దీంతో ఆ పిల్లల తల్లిదండ్రులకు రెస్టారెంట్‌పై కోపం వచ్చింది.

రెస్టారెంట్‌ సిబ్బందికి సహకరించాల్సింది పోయి ఆ కుటుంబం వారితో ఘర్షణకు దిగింది. రెస్టారెంట్ యజమాని ఐశ్వర్య ఖన్నా సింగ్ మాట్లాడుతూ.. ఆస్తిని ధ్వంసం చేశారని, సిబ్బందిని మాటలతో దూషించారని, ఇన్‌ఫ్లుయెన్సర్లమని చెప్పి బెదిరించారని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, పత్రాలు తమ వద్ద భద్రంగా ఉన్నాయని యాజమాన్యం తెలిపింది.

"ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాం. రెస్టారెంట్ పిల్లలు ఆడుకునే ప్రదేశం కాదు. ఇన్‌ఫ్లుయెన్సర్ హోదా ఉన్నంత మాత్రాన ఇటువంటివి తగవు. పౌర బాధ్యత అంటే పిల్లలకు జవాబుదారీతనం నేర్పించడం, ప్రజల ఆస్తిని గౌరవించడం, ప్రతి ఒక్కరూ సురక్షితంగా, ప్రశాంతంగా ఉండేందుకు నియమాలను పాటించడం. ఈ విలువలను పట్టించుకోకపోతే సిబ్బంది, ఇతర అతిథులు, వ్యాపారం అన్నీ ప్రభావితమవుతాయి" అని ఐశ్వర్య ఖన్నా సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

రెస్టారెంట్ అన్ని ప్రాంతాల నుంచి వచ్చే అతిథులను స్వాగతిస్తుందని, అయితే ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా ప్రవర్తించాలని స్పష్టం చేసింది. ఆస్తిని ధ్వంసం చేయడం, క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించడం, సిబ్బందిని బెదిరించడం సహించబోమని తెలిపింది. "అతిథి సత్కారం మా పని. కనీస మర్యాద ప్రతి ఒక్కరి బాధ్యత" అని తన ప్రకటనలో పేర్కొంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement