
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ తీరుతెన్నులను భారత్ ఎండగట్టింది. భారతదేశం వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పరిణమిస్తుండగా, పాకిస్తాన్ ఒకవైపు మతతత్వం, మరోవైపు ఉగ్రవాదంలో మునిగిపోయి, భారీ రుణగ్రహీతగా మారిందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత ప్రతినిధి పర్వతనేని హరీష్ పేర్కొన్నారు.
ఐక్యరాజ్యసమితిలో ‘అంతర్జాతీయ శాంతి- భద్రతను ప్రోత్సహించడం’ అనే అంశంపై జరిగిన ఉన్నత స్థాయి బహిరంగ చర్చలో పర్వతనేని హరీష్ మాట్లాడుతూ, భారతదేశం పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశమని, పురోగతి, శ్రేయస్సు, అభివృద్ధి నమూనాలలో ఎదుగుతున్నదని పేర్కొన్నారు. పొరుగుదేశం ఇందుకు భిన్నంగా ఉన్నదని ఆరోపించారు. భారత్ ఐక్యరాజ్యసమితి లక్ష్యంలో భాగస్వామ్యం వహిస్తూ, మరింత శాంతియుత, సంపన్నమైన,ప్రపంచం కోసం సమిష్టిగా కృషి చేయడంలో చురుకుగా, నిర్మాణాత్మకంగా పాల్గొంటున్నదని అన్నారు.
భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడుతుండగా, అదే సమయంలో పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికల నుండి రుణాలు తీసుకోవడంలో బిజీగా ఉందని హరీష్ ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజానికి ఆమోదయోగ్యం కాని పద్ధతులకు పాల్పడుతున్నదని ఆయన అన్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడిని గుర్తు చేస్తూ, ఈ ఘటనలో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది అమాయక పౌరులను కాల్చి చంపారని హరీష్ పేర్కొన్నారు. అనంతరం భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించి పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను తునాతునకలు చేసిందన్నారు.