India gets G20 presidency as Summit in Bali concludes - Sakshi
Sakshi News home page

మళ్లీ మోదీ మాటే ప్రధాన చర్చగా.. ముగిసిన జీ20 భేటీ! భారత్‌కు అధ్యక్ష బాధ్యతల అప్పగింత

Published Thu, Nov 17 2022 7:36 AM

India gets G20 presidency as Bali Summit concludes - Sakshi

బాలి: ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యా తక్షణమే ముగింపు పలకాలని జీ20 సదస్సు నాయకులు పిలుపునిచ్చారు. ఇది యుద్ధాలు చేసుకునే శకం కాదని నినదించారు. ఉజ్బెకిస్తాన్‌లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన మాటలే జీ–20 సదస్సులో కూడా ప్రతిధ్వనించాయి. ఇది యుద్ధాల శకం కాదంటూ నాడు పుతిన్‌తో మోదీ చెప్పిన హితవచనాలనే జీ–20 సదస్సు ముగింపు రోజు బుధవారం సంయుక్త ప్రకటన విడుదల చేసింది.

ఇండోనేషియాలోని బాలిలో జరిగిన రెండు రోజుల సదస్సులో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర, ప్రపంచ దేశాలపై దాని ప్రభావంపైనే ఎక్కువగా చర్చ జరిగింది. ‘‘శాంతి స్థాపన, కాల్పుల విరమణ, ఉద్రిక్తతల నివారణకే జీ–20 దేశాలు పిలుపునిస్తున్నాయి. ఉక్రెయిన్‌లో అరాచకాలకు, యుద్ధానికి  తెరపడాలి. ఈ యుద్ధం ఇంకా కొనసాగితే ఆహార, ఇంధన భద్రతలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది’’ అని ఆ డిక్లరేషన్‌ పేర్కొంది. ‘‘ఘర్షణల శాంతియుత పరిష్కారం, సంక్షోభ నివారణకు కృషి, దౌత్యం, చర్చలు ఇవన్నీ ఇప్పుడు కీలకమే. ఇది యుద్ధాలు చేసుకునే శకం కాదు’’ అని ఆ డిక్లరేషన్‌లో సభ్యదేశాలు మూకుమ్మడిగా నినదించాయి. 

ఉక్రెయిన్‌ యుద్ధంపై భిన్నాభిప్రాయాలు  
రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంపై జీ–20 సదస్సులో సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ అంతర్జాతీయ చట్టాలను అందరూ కట్టుబడి ఉండాలని సదస్సు గట్టిగా చెప్పింది. సంక్షోభంలో చిక్కుకున్న పౌరుల రక్షణ కూడా అత్యంత ముఖ్యమైనదేనని స్పష్టం చేసింది. సదస్సులో పాల్గొన్న అత్యధిక సభ్య దేశాలు రష్యా యుద్ధాన్ని తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయ చట్టాలను యదేచ్ఛగా ఉల్లంఘిస్తూ  రష్యా చట్టవిరుద్ధంగా అన్యాయంగా చేస్తున్న యుద్ధం ఫలితంగా ప్రపంచం ఆర్థికంగా కోలుకోలేకుండా ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. శాంతి, స్థిరత్వాలను పరిరక్షించే అంతర్జాతీయ చట్టాలను అన్ని దేశాలు పాటించేలా చూడాలని పేర్కొన్నాయి. అణ్వాయుధాలను ప్రయోగిస్తామని రష్యా చేస్తున్న బెదిరింపులు ఆమోద యోగ్యం కాదని, ఈ యుద్ధంతో మానవీయ సంక్షోభంతో పాటు ఆర్థిక భారం కూడా ప్రపంచ దేశాలు మోయాల్సి ఉంటుందని వీలైనంత త్వరంగా యుద్ధానికి ముగింపు పలకాలని పేర్కొన్నాయి. కొన్ని దేశాలు మాత్రం అన్ని అంశాలను తులనాత్మకంగా బేరిజు వేసుకోవాలని తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి.  

భారత్‌ది కీలక పాత్ర 
డిక్లరేషన్‌ రచనలో భారత్‌ ఇతర వర్ధమాన దేశాలతో కలిసి కీలకంగా వ్యవహరించింది. అన్ని దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరడానికి , ఒకే తాటిపై నిలబడడానికి భారత దౌత్య బృందానికి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తూ ప్రధాని మోదీ ప్రముఖ పాత్ర పోషించారని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్‌ క్వాత్రా చెప్పారు. ‘‘భారత్‌ తనకున్న , సానుకూల, నిర్మాణాత్మక వైఖరితో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్న దేశంగా ఎదిగింది. పరిష్కార మార్గాలను చూపించడంలోనూ, అన్ని దేశాల మధ్య ఏకాభిప్రాయాలను సాధించడంలోనూ ముందుంది’’ అని జీ–20 డిక్లరేషన్‌ భారత్‌ను కొనియాడింది.  

ఉగ్రవాదులకు నిధులు అందకుండా చూడాలి 
ఉగ్రవాదానికి నిధులందించే కార్యకలాపాల కట్టడికి దేశాలన్నీ కలిసి రావాలని జీ 20 సభ్య దేశాలు పిలుపునిచ్చాయి. మనీ లాండరింగ్‌ని నిరోధించడం, ఉగ్రవాద సంస్థలకి నిధులు అందకుండా వ్యూహాత్మక వ్యవహరించడంతో చిత్తశుద్ధి ప్రదర్శించాలని సంయుక్త ప్రకటన పేర్కొంది. ఉగ్రవాద ముప్పు లేకుండా అన్ని దేశాలు కృషి చేయాలని ఆ ప్రకటన స్పష్టం చేసింది. మరోవైపు కరోనాతో కుదేలైన పర్యాటక రంగానికి ఊతమిచ్చే చర్యలపై కూడా సమావేశం దృష్టి సారించింది.  

భారత్‌కు జీ 20 అధ్యక్ష బాధ్యతలు
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కూటమి జీ 20 అధ్యక్ష బాధ్యతల్ని భారత్‌ స్వీకరించింది. బాలిలో జరిగిన ముగింపు సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీకి ఇండొనేసియా అధ్యక్షుడు జోకో విడోడో లాంఛనంగా అధ్యక్ష బాధ్యతల్ని అప్పగించారు. వచ్చే ఏడాది సదస్సు భారత్‌ ఆధ్వర్యంలో జరగనుంది. జీ 20 అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడం ప్రతి భారతీయుడికీ గర్వకారణమని మోదీ అన్నారు. ‘‘ఇవి అత్యంత ప్రతిష్మాత్మక బాధ్యతలు. సభ్య దేశాల సహాయ సహకారాలతో ప్రపంచ సంక్షేమానికి జీ 20 సదస్సును వేదికగా మారుస్తాం. ప్రపంచంలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభం, ఆహారం, ఇంధన ధరల పెరుగుదల వంటి సమస్యల నేపథ్యంలో కూటమి సారథ్య బాధ్యతలు స్వీకరిస్తున్నాం. అన్ని దేశాలు జీ 20 వైపే ఆశగా చూస్తాయి. భారత్‌ ఆధ్వర్యంలో జీ 20 అందరినీ కలుపుకొని పోతూ నిర్ణయాత్మకంగా, చర్యలు తీసుకునేలా ఉంటుంది. వచ్చే ఏడాదిలోగా జీ 20 కొత్త కొత్త ఆలోచనలు చేసి, సమష్టి నిర్ణయాలు తీసుకునేలా తీర్చిదిద్దుతాం’’ అని అన్నారు. 2024లో బ్రెజిల్‌లోనూ, ఆ తర్వాత ఏడాది 2025లో దక్షిణాఫ్రికాలోనూ జీ 20 సదస్సు జరగనుంది.

Advertisement
Advertisement