రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: కీలక ఓటింగ్‌కు భారత్, చైనా దూరం

India Abstains From UNGA Vote Lasting Peace In Ukraine - Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం నిర్వహించింది.  ఈ యుద్ధాన్ని రష్యా  తక్షణమే  ముగించాలని, బలగాలను వెనక్కిమళ్లించాలని సభ్య దేశాలు తీర్మానించాయి. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొలపాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పాయి.

ఐరాస జనరల్ అసెంబ్లీలో మొత్తం 193 సభ్య దేశాలున్నాయి. అయితే రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదం కోసం జరిగిన ఓటింగ్‌లో 141 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. 7 దేశాలు మాత్రం వ్యతిరేకించాయి. భారత్, చైనా సహా 32 దేశాలు మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

ఐరాస జనరల్‌ అసెంబ్లీలో రష్యాకు వ్యతిరేకంగా తీర్మానాలు జరిగిన ప్రతిసారి భారత్ ఓటింగ్‌కు దూరంగానే ఉంటోంది. ఇరు దేశాలు దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని, శాంతి స్థాపనకు కృషి చేయాలని సూచిస్తోంది. అటు చైనా కూడా రష్యాకు అనుకూలం కాబట్టి ప్రతిసారి ఆ దేశానికి సానుకూలంగా వ్యవహరిస్తోంది.

ఫిబ్రవరి 24న మొదలై..
ఐరోపా దేశాల కూటమి నాటోలో చేరాలనుకున్న  ఉక్రెయిన్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రష్యా.. 2022 ఫిబ్రవరి 24న ఆ దేశంపై దండయాత్రకు దిగింది. లక్షల మంది సైన్యం, క్షిపణులు, బాంబులతో విరుచుకుపడింది. యుద్ధాన్ని మూడు రోజుల్లోనే ముగిస్తామని అతివిశ్వాసం ప్రదర్శించింది. అయితే ఉక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటించడంతో రష్యాకు ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. ఉక్రెయిన్‌కు ఇతర దేశాలు మద్దతుగా నిలిచి ఆయుధాలు సమకూర్చడంతో రష్యాకు కూడా యుద్ధంలో తీవ్ర నష్టం వాటిల్లింది.

ఏడాదిగా జరుగుతున్న ఈ యుద్ధంలో ఇరు దేశాలకు చెందిన 42,295 మంది ప్రాణాలు కోల్పోయారు. 56,576 మంది తీవ్రంగా  గాయపడ్డారు. 15,000 మంది గల్లంతయ్యారు. 1.4కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. 1,40,000 భవనాలు ధ్వంసం అయ్యాయి. లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. అయినా ఇరు దేశాలు వెనక్కి తగ్గడం లేదు. యుద్ధాన్ని ఆపే ప్రయత్నాలు కూడా చేయడం లేదు.
చదవండి: సూపర్‌మార్కెట్లలో కూరగాయలు, పండ్లపై పరిమితులు.. ఒక్కరికి మూడే!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top