పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ఊరట? | Imran Khan Shifted To Shifa Hospital After 3 Years In Jail? PTI Claims Relief Amid Growing Doubts, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ఊరట?

Aug 21 2026 7:03 AM | Updated on Aug 21 2026 10:57 AM

Imran Khan Finally Really Out of Jail: SC Orders Hospital Shift

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (PTI) అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ను ఎట్టకేలకు ఊరట లభించిందా?. మూడేళ్ల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చారా?. గురువారం అర్ధరాత్రి దాటాక రావల్పిండి జైలు నుంచి ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్‌ ఆస్పత్రికి తరలించినట్లు ప్రచారం జరుగుతున్నాయి. ఈ విషయాన్ని పీటీఐ వర్గాలు ధృవీకరించగా.. ఆయన అభిమానులు మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

వివిధ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్‌ ఖాన్‌.. మూడేళ్లుగా అడియాలా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు.. ప్రత్యేక చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఆయన చికిత్స విషయంలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని కోర్టుకు తెలిపారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఆయన్ని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించింది.

అయితే రివ్యూ పిటిషన్‌ పేరిట రెండ్రోజులు పాక్‌ ప్రభుత్వం హైడ్రామా నడిపింది. చివరకు..  కోర్టు ఆదేశాల మేరకు ఆస్పత్రికి తరలిచింది. ఆయన చూపు క్షీణించిందని.. కుడి కన్ను శాశ్వతంగా కనిపించడం లేదని ఆయన తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. అలాగే 73 ఏళ్ల ఇమ్రాన్‌కు భారీగా బరువు తగ్గి బక్కచిక్కిపోయారని చెప్పారు.  మరోవైపు ఇమ్రాన్‌కు తక్షణ ఆస్పత్రి చికిత్స అవసరమయ్యే పరిస్థితి లేదని వైద్య నివేదికలు సూచిస్తున్నాయని పాకిస్థాన్‌ ప్రభుత్వం చెబుతోంది.

అయితే ఆయన తరలింపు సమయంలో నడిచిన హైడ్రామాపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే ఆయన్ని తరలించారా?.. ఫొటోలు రిలీజ్‌ చేయాలంటూ.. కోరుతున్నారు. పాక్‌లో నియంతృత్వ ప్రభుత్వం నడుస్తోందని.. ఇమ్రాన్‌ ఖాన్‌ను చంపే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఇటు కోర్టు ఆదేశాల మేరకు.. ఆయనకు వ్యక్తిగత వైద్యుడితో కూడిన వైద్య బృందం పరీక్షలు నిర్వహించేందుకు షిఫా ఆస్పత్రి సిద్ధమైంది. తదుపరి విచారణ జరిగే సెప్టెంబర్‌ 16 వరకు ఆయన ఆస్పత్రిలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇమ్రాన్‌ ఖాన్‌కు గత జనవరిలో కుడి కంటికి సెంట్రల్‌ రెటినల్‌ వీన్‌ అక్లూజన్‌ అనే సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయింది. అప్పటి నుంచి చికిత్స కోసం ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (PIMS)కు పలుమార్లు తరలించారు. అయితే ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తోందని కుటుంబ సభ్యులు, పీటీఐ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వ ఆస్పత్రికి బదులుగా ప్రైవేట్‌ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్‌ చేశారు. జైలులో వైద్య సేవలు, కుటుంబ సభ్యులు, న్యాయవాదులతో భేటీలపై ఆంక్షలు ఉన్నాయని కూడా వారు ఆరోపించారు.

పీటీఐలో కొత్త ఆశలు
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇమ్రాన్‌ను ఆస్పత్రికి తరలించడాన్ని ఆయన పార్టీ స్వాగతించింది. కోర్టు నిర్ణయం తమకు ‘కొత్త ఆశాకిరణం’ అని పార్టీ ప్రతినిధి జుల్ఫికర్‌ బుఖారీ పేర్కొన్నారు. అయితే ఇమ్రాన్‌కు మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళనలకు పార్టీ సిద్ధమవుతోందని తెలిపారు. సెప్టెంబర్‌ 27న దేశవ్యాప్త మార్చ్‌కు పిలుపునిచ్చిన PTI.. ఇమ్రాన్‌కు మద్దతుదారులను కలిసే అవకాశం కల్పించడం, ఆయనపై ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయడం, చివరకు ఆయనను విడుదల చేయడం వంటి డిమాండ్లను ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది.

2023 నుంచి జైల్లోనే..
మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ 2018లో పాకిస్థాన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2022లో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆయన పదవి కోల్పోయారు. అనంతరం ఆయనకు, PTIకి, పాకిస్థాన్‌ సైనిక వ్యవస్థకు మధ్య తీవ్ర విభేదాలు కొనసాగాయి. 2023 మే 9న ఇమ్రాన్‌ అరెస్టు దేశవ్యాప్తంగా భారీ నిరసనలు, హింసకు దారితీసింది. ఆ తర్వాత అదే ఏడాది ఆగస్టు 5న తోషాఖానా కేసుతో సహా అవినీతి ఆరోపణల కేసుల్లో ఆయనను మరోసారి అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు.

తనపై నమోదైన కేసులన్నీ రాజకీయ కక్షతో పెట్టినవేనని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపిస్తున్నారు. అయితే పాకిస్థాన్‌ ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. కిందటి ఏడాది అక్టోబర్‌-నవంబర్‌ నుంచి ఆయన నుంచి సోషల్‌ మీడియా ఖాతాలోనూ ఎలాంటి అప్‌డేట్‌ లేకుండా పోయింది. దీంతో ఆయన ప్రాణాలతోనే ఉన్నారా? అనే అనుమానాలు సైతం ‍వ్యక్తం అయ్యాయి. ప్రస్తుతం ఆయనపై పలు కేసులు, న్యాయపరమైన సవాళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో.. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆస్పత్రికి తరలింపు పాకిస్థాన్‌ రాజకీయాల్లో మరో కీలక పరిణామంగా మారింది.

ఇదీ చదవండి: పాక్‌లో మరింత పవర్‌ఫుల్‌గా మునీర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement