మూడింట రెండొంతుల భారీ మెజార్టీతో నెగ్గిన యువనేత పీటర్ మాగ్యా
బుడాపెస్ట్: నాటో కూటమిలో ఉంటూ యూరప్‌కు పక్కలో బల్లెంలా తయారైన హంగరీ ప్రధానమంత్రి విక్టర్ ఆబన్ 16 ఏళ్ల నిరంకుశ పాలనకు హంగరీయన్లు తెరదించారు. ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో విక్టర్ సారథ్యంలోని ఫీదెస్ పార్టీని ఓటర్లు చిత్తుగా ఓడించారు. సోమవారంనాటికి 98 శాతం ఓట్ల లెక్కింపు పూర్తవ్వగా ఇప్పటిదాకా వెల్లడైన ఫలితాల ప్రకారం విక్టర్‌కు చెందిన ఫీదెస్ పార్టీ కేవలం 55 చోట్ల గెలిచింది.
యువనేత పీటర్ మాగ్యా సారథ్యంలోని టీసా పార్టీకి జనం బ్రహ్మరథంపట్టారు. మూడింట రెండొంతుల స్థానాల్లో టీసా పార్టీ విజయంసాధించింది. దీంతో విక్టర్ ఆబన్ పాలనాశకం అంతమైంది. పీటర్ పార్టీ ఏకంగా 138 చోట్ల విజయం సాధించింది. అవర్ హోంల్యాండ్ పార్టీకి కేవలం ఆరు సీట్లు దక్కాయి. యూరప్ సభ్యదేశంగా ఉంటూ నాటోకు దన్నుగా నిలబడాల్సిందిపోయి రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు గట్టి మద్దతునిస్తూ ఆబన్ ఐరోపా దేశాలకు కంట్లో నలుసులా తయారయ్యాడు.
యుద్ధంలో రష్యాను దెబ్బతీసేందుకు ఉక్రెయిన్‌కు భారీస్థాయిలో సైనిక సాయం చేయాలని నాటో సభ్య దేశాలు భావించిన ప్రతిసారీ విక్టర్ తన వీటో అధికారంతో ఏకాభిప్రాయానికి మోకాలడ్డి విమర్శలపాలయ్యారు. పశ్చిమాసియా యుద్ధంలో తనతో కలిసిరాని నాటో దేశాలపై గుర్రుగా ఉన్న ట్రంప్‌తోనూ విక్టర్‌కు సత్సంబంధాలున్నాయి. అమెరికా ఎన్నికల్లో జేడీ వాన్స్ తరఫున సైతం విక్టర్ ప్రచారంచేశారు.
గత 16 ఏళ్లుగా హంగరీలో విక్టర్ తన బంధువులు, అనుచరులు, మిత్రులకు కీలక పదవులు అప్పగించి పాలనను అనుకూలంగా మార్చుకున్నారు. కుదేలైన ఆర్థికవ్యవస్థ, అప్రజాస్వామిక విధానాలతో దేశం పరువును మంటగలిపారు. తర్వాతి పాలకులు తన పరిపాలనా నిర్ణయాలను మార్చేయకుండా రాజ్యాంగ సవరణ చేశారు. రాజ్యాంగ ధర్మాసనం అధికారాలను పరిమితంచేశారు. తనకు అనువైన వ్యక్తులకు జడ్జీలుగా పదవులు కట్టబెట్టారు. మీడియాపై ఆంక్షలు విధించి ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాయకుండా అడ్డుకున్నారు.
విక్టర్ అస్తవ్యస్థ పాలన ఎట్టకేలకు అంతమైందని గెలిచిన యువనేత పీటర్ మాగ్యా ఆదివారం రాత్రి డాన్యూబ్ నదీతీరంలో పార్లమెంట్ ప్రాంగణంలో వేలాది మంది కార్యకర్తల సమక్షంలో ప్రసంగించారు. దేశంలో నూతన శకం ఆరంభమైందన్నారు. విక్టర్ ఓటమి వార్త తెలిసి లక్షలాది మంది జనం వీధుల్లోకి వచ్చి సంబరాలుచేసుకున్నారు. సోమవారం తెల్లవారుజాముదాకా సంబరాలు కొనసాగాయి. విక్టర్ పాలన ముగియడాన్ని పలు యూరప్ దేశాలు స్వాగతించాయి. దేశంలో అవినీతిని అంతమొందిస్తానని, యూరో కరెన్సీని తీసుకొస్తానని పీటర్ ఎన్నికల్లో వాగ్దానంచేశారు. ఎన్నికల్లో గెల్చిన పీటర్‌కు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.


