ముంబైలోని ఓ హోటల్‌లోకి ప్రవేశించిన వరద నీరు
దేశవ్యాప్తంగా భారీ వర్షాలు!
ముంబై/ఈటానగర్/బిలాస్‌పూర్/ కోల్‌కతా/తిరువనంతపురం: ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు భారత్‌పై కరుణ చూపడం మొదలుపెట్టాయి. కేరళ, మహారాష్ట్ర, పశి్చమబెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా రానున్న ఒకట్రెండు రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగనుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. పలుచోట్ల నదులు పొంగిపొర్లుతుండగా వరద ముప్పును తట్టుకునేందుకు కొన్ని రాష్ట్రాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. నదీ పరీవాహక ప్రాంతాలు, డ్యామ్‌ల వద్ద నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా పశ్చిమ బెంగాల్ మొత్తానికి రెడ్ అలర్ట్ ప్రకటించారు.
ముంబైతోపాటు మహారాష్ట్రలో భారీ వర్షాలను సూచిస్తూ అధికారులు రెడ్ అలర్ట్ హెచ్చరిక జారీ చేశారు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో 24 గంటల్లోనే 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. లోకల్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. థానే, పాల్‌ఘర్ జిల్లాల్లోనూ శనివారం భారీ వర్షాలు కురిశాయి.
థానేలో ఐదు గంటల్లోనే 65.79 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, పాల్‌ఘర్‌లో ఇది 97.7 మిల్లీమీటర్లుగా ఉంది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. థానే జిల్లాలో 35 ఏళ్ల మహిళ విద్యుత్ షాక్‌తో మరణించింది. కాల్వా ప్రాంతంలో చెట్టు మీదపడటంతో ఇద్దరు గాయపడ్డారు. పాల్‌ఘర్ ప్రాంతంలోని తండ్లువాడీ కోటలో దట్టమైన మంచు కారణంగా దారితప్పిన ఆరుగురు పర్యాటకులను రక్షించినట్లు పాల్‌ఘర్ ఎస్పీ యతీశ్ దేశ్‌ముఖ్ తెలిపారు. వీరంతా పాల్‌ఘర్‌లోని దండేకర్ కాలేజీ విద్యార్థులని చెప్పారు.
ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదల బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎంఐ–172 హెలికాప్టర్‌ను రంగంలోకి దించింది. ఆహారం, వైద్యసామగ్రిని సరఫరా చేస్తోంది. లోయర్ సియాంగ్ జిల్లాలో ఆకస్మిక వరదల కారణంగా కొండచరియలు విరిగిపడి అనేక గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. వంతెనలు కూలిపోవడం, రోడ్లు మూసుకుపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అకాజన్–లికాబాలి–బమే రహదారిపై శిథిలాల తొలగింపు పనులు జరుగుతున్నందున ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ జిల్లా కర్యాల్ గ్రామంలో భారీ వర్షాలకు భూమి కుంగిపోతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పగుళ్లు, నేల జారిపోవడంతో భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు.


