కరోనా కట్టడికి కిటికీలు తెరవాలి!

Good Air Flow May Help Protect From COVID - Sakshi

గ్వాంగ్‌జౌ : కరోనా రోగులతో సన్నిహితంగా ఉన్నా, వారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు శ్లేష్మం తుంపర్లు మీద పడినా కరోనా వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి సోకుతుందని అందరికి తెల్సిందే. కరోనా వైరస్‌ బాధితుడు తుమ్మినా, దగ్గినా తుంపర్ల ద్వారా బాహ్య వాతావరణంలోకి వెలువడే కరోనా వైరస్‌ కొన్ని గంటలపాటు అలా గాలిలో జీవిస్తాయని, అవి ఆవహించి ఉన్న ప్రాంతం నుంచి వెళ్లేవారికి కూడా అవి సోకుతాయని జూలై నెలలో దేశంలోని 200 మంది శాస్త్రవేత్తలు ఓ అభిప్రాయానికి వచ్చారు. అంటే కరోనా వైరస్‌ గాలి ద్వారా కూడా సోకుతుందన్నమాట. ‘జర్నల్‌ క్లినికల్‌ ఇన్‌ఫెక్సియస్‌ డిసీసెస్‌’లో ఈ మేరకు జూలై 6వ తేదీన ఓ వ్యాసాన్ని కూడా ప్రచురించారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అంగీకరించింది.

ఈ కారణంగా మన ప్రమేయం లేకుండా మన ఇళ్లలోకి కూడా కరోనా వైరస్‌ వచ్చే ప్రమాదం ఉంది. ఆ దాడి నుంచి తప్పించుకోవాలంటే ఇంట్లో గాలిపోయే మార్గాలను, అంటే తలుపులను, కిటికీలను వీలైనంత వరకు తెరచి ఉంచాలని.. భవనాలు లేదా ఇళ్ల నిర్మాణాలు కూడా గాలి, వెలుతురు వచ్చేలా, ఇంట్లో గాలి బయటకు వెళ్లేలా ఉండాలని శాస్త్రవేత్తలతోపాటు ఆర్కిటెక్ట్‌లు సూచిస్తున్నారు. వెంటిలేషన్‌ సరిగ్గా లేని రెస్టారెంట్లు, పబ్బులు, మందిరాల్లో కరోనా కేసులు ఎక్కువగా వ్యాపించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. చైనాలోని గ్వాంగ్‌జౌ నగరంలో కిటికీలులేని ఐదో అంతస్తు రెస్టారెంట్‌లో మధ్యాహ్నం భోజనం చేసిన పది మందికి కరోనా వచ్చింది. కరోనా నుంచి తప్పించుకోవాలంటే మాస్క్‌లు, శానిటైజర్లు ఉపయోగించడం ఎంత అవసరమో, ఇంటికి కిటికీలు, వెంటిలేటర్లు తెరచి ఉంచడం కూడా అంతే అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు. (చదవండి: కరోనా కట్టడిలో ఆ నగరాలు ఫస్ట్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top