అమిత వేగంతో దూసుకెళ్తూ.. అడుగుకో నక్షత్రాన్ని పుట్టిస్తూ.. 

A giant black hole at the center of a galaxy - Sakshi

అంతరిక్షంలో నక్షత్రాలన్నీ సమూహాలు (గెలాక్సీలు)గా.. అక్కడో గుంపు, ఇక్కడో గుంపు అన్నట్టుగా ఉంటాయి. కానీ శాస్త్రవేత్తలకు ఒకచోట మాత్రం ఏదో గీత గీసినట్టుగా నక్షత్రాల వరుస కనిపించింది. అదేదో పదులు, వందల్లో కాదు.. లక్షల నక్షత్రాలు అలా లైన్‌ కట్టాయి. అదేమిటా అని చూస్తే నోరెళ్లబెట్టేసంగతి బయటపడిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా..     – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

నక్షత్రాల లైన్‌ ఏమిటని చూసి.. 
సాధారణంగా ప్రతి నక్షత్ర సమూహం (గెలాక్సీ) మధ్యలో పెద్ద బ్లాక్‌హోల్‌ ఉంటుంది. దాని చుట్టూరానే నక్షత్రాలు పరిభ్రమిస్తూ ఉంటాయి. నక్షత్రాలు కూడా గుంపుగా ఉంటాయి. కానీ ఇటీవల హబుల్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ తీసిన చిత్రాల్లో.. నక్షత్రాలు ఒక గీతలా వరుసగా ఉండటం, అదీ ఓ చిన్న గెలాక్సీ దగ్గర మొదలై కోట్ల కిలోమీటర్ల పొడవునా కనిపించడంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. చిత్రాల్లో అదేదో ‘పొరపాటు (ఎర్రర్‌)’ కావొచ్చని తొలుత భావించారు. కానీ యేల్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ పీటర్‌ వాన్‌ డొక్కుమ్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దీనిపై పరిశోధన చేసి.. ఆ నక్షత్రాల వరుస ముందు ఓ ప్రకాశవంతమైన వస్తువును గుర్తించింది. క్షుణ్నంగా పరిశీలించి అది కృష్ణబిలం అని తేల్చింది. 

గెలాక్సీ నుంచి తప్పించుకుని.. 
ఓ పెద్ద కృష్ణబిలం తన గెలాక్సీ నుంచి తప్పించుకుని, అమిత వేగంతో ప్రయాణిస్తూ.. దారిలో ఈ నక్షత్రాల పుట్టుకకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు తేల్చారు. రెండు, మూడు గెలాక్సీలు ఢీకొన్న క్రమంలో.. ఒక గెలాక్సీ నుంచి విసిరేసినట్టుగా ఈ కృష్ణబిలం బయటికి వచ్చి ఉంటుందని అంచనా వేశారు. దాని పరిమాణం మన సూర్యుడి కంటే రెండు కోట్ల రెట్లు పెద్దగా ఉందని.. అది గంటకు సుమారు 58 లక్షల కిలోమీటర్ల అమిత వేగంతో ప్రయాణిస్తోందని గుర్తించారు. 

నక్షత్రాలు ఎలా ఏర్పడుతున్నాయి? 
విశ్వం ఏర్పడే క్రమంలో గెలాక్సీలతోపాటు వాటి మధ్యలో అక్కడక్కడా విడిగా వాయువులు, ఇతర ఖగోళ పదార్థాలు ఉండిపోయాయని శాస్త్రవేత్త పీటర్‌ వాన్‌ చెప్పారు. ఈ కృష్ణబిలం ప్రయాణిస్తున్న క్రమంలో దాని ఆకర్షణ శక్తి వల్ల వాయువులు, ఖగోళ పదార్థాలు ఒక్కచోటికి చేరుతున్నాయని తెలిపారు. ఇదే సమయంలో కృష్ణబిలం వెనుక ఏర్పడే అతిశీతల పరిస్థితితో.. అవి సంకోచించి నక్షత్రాలు జన్మిస్తున్నాయని వివరించారు. విశ్వంలో ఇలాంటి దానిని గుర్తించడం ఇదే మొదటిసారని తెలిపారు. దీని గుట్టు తేల్చేందుకు త్వరలో ప్రఖ్యాత జేమ్స్‌వెబ్‌ టెలిస్కోప్‌తో పరిశీలించనున్నామని వెల్లడించారు. 

ఏమిటీ కృష్ణ బిలం? 
అతిపెద్ద నక్షత్రాలు వేలకోట్ల ఏళ్లపాటు మండిపోయి, ఇంధనం ఖాళీ అయ్యాక.. వాటిలోని పదార్థమంతా కుచించుకుపోయి ‘కృష్ణబిలం’గా మారుతాయి. వీటి గురుత్వాకర్షణ శక్తి చాలా తీవ్రంగా ఉండి.. సమీపంలోకి వచ్చే అన్నింటినీ తమలోకి లాగేసుకుంటాయి. కాంతి కూడా వాటి నుంచి తప్పించుకోలేకపోవడంతో.. నేరుగా కనబడవు. అందుకే కృష్ణబిలం (బ్లాక్‌హోల్స్‌) అని పిలుస్తారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top