ఈయూలో చేరిక అంశం వాయిదా | Georgia suspends talks on joining the European Union | Sakshi
Sakshi News home page

ఈయూలో చేరిక అంశం వాయిదా

Published Sat, Nov 30 2024 6:04 AM | Last Updated on Sat, Nov 30 2024 6:04 AM

Georgia suspends talks on joining the European Union

జార్జియా రాజధాని టిబిలిసీలో భారీ నిరసనలు

టిబిలిసీ: యురోపియన్‌ యూనియన్‌(ఈయూ)లో జార్జియా చేరే అంశాన్ని నాలుగేళ్లపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రధాని ప్రకటించడంతో.. దేశంలో ఆగ్రహం వెల్లువెత్తింది. ప్రతిపక్షాలు పార్లమెంటును బహిష్కరించాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు.

 ఈయూ, జార్జియన్‌ జెండాలను ప్రదర్శిస్తూ పార్లమెంట్‌ వెలుపల ర్యాలీ నిర్వహించారు. రాజధాని టిబిలిసీ ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు శుక్రవారం నిరసనకారులపై బాష్పవాయువు, జలఫిరంగులను ప్రయోగించారు.  

కూటమి సిఫార్సులను నెరవేర్చాలనే షరతుతో ఈయూ 2023 డిసెంబరులో జార్జియాకు అభ్యర్థి హోదాను ఇచ్చింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ‘విదేశీ ప్రభావ’చట్టాన్ని ఆమోదించిన తరువాత దాని విలీనాన్ని నిలిపివేసింది. ఆర్థిక మద్దతును కూడా తగ్గించింది. ఈ నేపథ్యంలో జార్జియాలో అక్టోబర్‌ 26న ఎన్నికలు జరిగాయి. 

వీటిని యురోపియన్‌ యూనియన్‌లో చేరాలన్న దేశ ఆకాంక్షలకు రెఫరెండంగా భావించారు. అధికార జార్జియన్‌ డ్రీమ్‌ పార్టీనే ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే జార్జియాను తన అదీనంలోనే ఉంచుకోవాలనే రష్యా ప్రభావంతో ఓటింగ్‌లో రిగ్గింగ్‌ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. డబ్బు ప్రవాహం, డబుల్‌ ఓటింగ్, హింసాత్మక వాతావరణంలో ఓటింగ్‌ జరిగిందని యూరోపియన్‌ ఎన్నికల పరిశీలకులు సైతం తెలిపారు. అంతకుముందు, జార్జియన్‌ పార్లమెంటరీ ఎన్నికలు నిష్పాక్షికంగా జరగలేదని యురోపియన్‌ పార్లమెంటు గత నెలలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. 

దీనికి అధికార జార్జియన్‌ డ్రీమ్‌ పార్టీదే పూర్తి బాధ్యతని తెలిపింది. ఏడాదిలోగా పార్లమెంటరీ ఓటింగ్‌ను పునఃసమీక్షించాలని, జార్జియాపై ఆంక్షలు విధించాలని, ప్రభుత్వంతో అధికారిక సంబంధాలను పరిమితం చేయాలని సభ్యులు ఈయూకు పిలుపునిచ్చారు. ఈయూ ఆరోపణలను జార్జియా ఖండించింది. ఇది బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలని, జార్జియాను శాసించే అధికారం ఎవ్వరికీ ఇవ్వబోమని ప్రధాని ప్రకటించారు. 

అంతేకాదు.. యురోపియన్‌ యూనియన్‌ దిశగా మా పంథాను కొనసాగిస్తామని తెలిపారు. అయితే 2028 చివరివరకు చర్చలను ఎజెండాలో ఉంచబోమని ప్రధాని కొబాఖిడ్జే గురువారం చెప్పారు. ఈయూ నుంచి ఎలాంటి బడ్జెట్‌ గ్రాంట్లను తీసుకోబోమని తెలిపారు. ప్రధాని ప్రకటన తర్వాత వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. టిబిలిసీలోని పార్లమెంటు భవనం ఎదుట ర్యాలీ నిర్వహించారు. ఇతర నగరాల్లోనూ ప్రదర్శనలు నిర్వహించారు.  

జార్జియన్‌ డ్రీమ్‌పార్టీ నిరంకుశంగా మారి మాస్కో వైపు మొగ్గు చూపుతోందని విమర్శకులు అంటున్నారు. అధ్యక్షుడు సలోమ్‌ జౌరాబిచి్వలి అధికారిక ఫలితాలను తిరస్కరించారు. పార్లమెంటు చట్టబద్ధతను గుర్తించడానికి నిరాకరించారు. వచ్చే నెలలో అధ్యక్షుడి ఆరేళ్ల పదవీకాలం ముగియనుంది.. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. ఎన్నికలను దేశాన్ని ఐరోపా నుంచి, రష్యా వైపు తీసుకెళ్లేందుకు జరిగిన ‘తిరుగుబాటు’గా అభివరి్ణంచారు. దేశ భవిష్యత్తుపై పాలకపక్షం యుద్ధం చేస్తోందని ఆరోపించారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement