ఈ ఫొటో చూడగానే ఏమనిపిస్తోంది? చల్లని ఐస్ ముక్క అనిపిస్తోంది కదా? కానీ కాదు.. ఇది వేడి వేడి ఫ్రైడ్ చికెన్ పీస్. ఎన్నో రకాల ఫ్రైడ్ చికెన్ చూశాం కానీ, ఈ ఐస్ ముక్కను పట్టుకుని ఫ్రైడ్ చికెన్ అంటారేంటి అనే కదా మీ డౌట్? ఎప్పుడూ ఎర్రగా ఉండే ఫ్రైడ్ చికెనేనా? పారదర్శకంగా ఉండే చికెన్ ఫ్రై చేస్తే పోలా అనుకున్నాడో ఫుడ్ బ్లాగర్. అంతే రకరకాల ప్రయోగాలు చేసి మరీ ఈ ఐస్ ముక్కలాంటి చికెన్ ఫ్రై చేసి ఔరా అనిపించాడు. చైనాకు చెందిన కై నాన్.. అచ్చం గాజుతో చేసినట్టుగా కనిపించే ఈ ఫ్రైడ్ చికెన్ చేసి ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాడు.
ఈయన తన వంటల్లో మాలిక్యులర్ గ్యాస్ట్రోనమీ అనే సంక్లిష్టమైన సాంకేతికతను ఉపయోగించి ఫేమస్ అయ్యాడు. తాజాగా గాజు కళాఖండాన్ని పోలిన ఫ్రైడ్ చికెన్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ‘నేను ఫ్రైడ్ చికెన్‌ను పారదర్శకంగా చేయాలనుకుంటున్నాను. కానీ ఫలితమే కొంచెం విచిత్రంగా ఉంది’అనే శీర్షికతో ఒక వీడియోను అప్‌లోడ్ చేశాడు. అది దాదాపు పది లక్షల వ్యూస్‌తో దూసుకుపోయింది. చూసేందుకు గాజు బొమ్మలా మెరిసిపోతున్న ఈ చికెన్ ముక్క వెనుక చాలా కసరత్తే ఉంది.
ఎలా తయారు చేశాడంటే..?
కై నాన్ ఈ గాజులాంటి ఫ్రైడ్ చికెన్ కోసం చికెన్‌ను ముక్కల వారీగా తిరిగి తయారు చేశాడు. ముందుగా చికెన్ ముక్కలను ఫ్రై చేశాడు. తర్వాత అందులోని ఎముకలను జాగ్రత్తగా తొలగించాడు. ఎముక మజ్జ, కొల్లాజెన్, కోల్డ్ జెల్ మిశ్రమాన్ని ఎముక ఆకారం ఉన్న అచ్చులలో పోసి గడ్డకట్టేలా చేశాడు. చికెన్‌ను ఒక ప్రత్యేక పరికరం ద్వారా ద్రవ రూపంలోకి మార్చాడు. ఆ తర్వాత ‘స్ఫెరిఫికేషన్’అనే పద్ధతిని ఉపయోగించి మాంసం పీచుల నిర్మాణాన్ని తిరిగి పారదర్శక రూపంలోకి తీసుకొచ్చాడు. చివరగా గాజులాంటి మాంసం, ఎముకలను మరో అచ్చులో ఉంచి ఫ్యూజ్ చేసి.. చికెన్ ముక్క ఆకారాన్ని తెచ్చాడు. అంతే.. అద్భుతమైన గాజు కళాఖండంలా కనిపించే ట్రాన్స్ పరెంట్ చికెన్ రెడీ అయిపోయింది. అయితే, కొందరు నెటిజన్లు దీనిని అద్భుతమైన కళాఖండమని, రుచి చూడాలని కుతూహలంగా ఉందని కామెంట్ చేస్తే.. మరికొందరు మాత్రం దీన్ని చూస్తుంటేనే భయం వేస్తోందని, అసలు తినే వస్తువులా లేదని పెదవి విరిచారు. ఇంతకీ మీరేం అంటారు?


