ఇక భీకర యుద్ధమే!  | Failure of US‑Iran talks, war continue | Sakshi
Sakshi News home page

ఇక భీకర యుద్ధమే! 

Mar 27 2026 3:37 AM | Updated on Mar 27 2026 3:37 AM

Failure of US‑Iran talks, war continue

చర్చలపై అమెరికా, ఇరాన్‌ మధ్య ప్రతిష్టంభన   

పశ్చిమాసియాకు చేరుకుంటున్న అమెరికా నౌకలు, జవాన్లు  

హార్మూజ్‌ జలసంధిపై పట్టు బిగించిన ఇరాన్‌   

విదేశీ నౌకల నుంచి టోల్‌ రుసుము వసూలు  

పశ్చిమాసియాలో 27వ రోజుకు చేరిన దాడులు, ప్రతిదాడులు 

ఇజ్రాయెల్‌ దాడిలో ఇరాన్‌ ఐఆర్‌జీసీ నేవీ చీఫ్‌ అలీ రెజా తంగ్సిరి మృతి  

దుబాయ్‌/టెహ్రాన్‌: పశ్చిమాసియా యుద్ధంమరింత తీవ్రతరమయ్యే సూచనలు కన్పిస్తుండడం ప్రపంచదేశాలకు ఆందోళన కలిగిస్తోంది. హార్మూజ్‌ జలసంధిని తెరిచే విషయంలో ఇరాన్‌ పట్టువీడకపోవడం, చర్చలపై షరతులకు అమెరికా ఒప్పుకోకపోవడం, వేలాది మంది అమెరికా జవాన్లు పశ్చిమాసియాలో అడుగుపెడుతుండడం వంటి పరిణామాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య ప్రతిష్టంభన నెలకొంది. చర్చల విషయంలో ఇరుపక్షాలు తమ వైఖరి నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. హార్మూజ్‌పై ఇరాన్‌ తన పట్టును మరింత బిగించింది. జలసంధి గుండా ప్రయాణించే విదేశీ నౌకల నుంచి దారి సుంకం(టోల్‌ ఫీజు) వసూలు చేస్తోంది. 

కనీసం రెండు నౌకలు చైనా కరెన్సీ యువాన్లలో ఇరాన్‌కు చెల్లింపులు చేసినట్లు స్థానిక వార్తా సంస్థలు వెల్లడించాయి. పార్లమెంట్‌లో ఆమోదం పొంది టోల్‌ వసూలును అధికారం చేయబోతున్నట్లు సమాచారం. నౌకలు క్షేమంగా జలసంధిని దాటాలంటే రుసుము చెల్లించక తప్పదని ఇరాన్‌ అధికారులు అంటున్నారు. హార్మూజ్‌లో ఇరాన్‌ టోల్‌ బూత్‌ తెరిచినట్లు ఆరు గల్ఫ్‌ అరబ్‌ దేశాల కూటమి అయిన గల్ఫ్‌ సహకార మండలి ప్రధాన కార్యదర్శి మొహమ్మద్‌ అల్‌–బుదైవీ నిర్ధారించారు. నౌకల నుంచి టోల్‌ వసూలు చేస్తే హార్మూజ్‌ నుంచి చమురు దిగుమతి చేసుకొనే దేశాల్లో ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.  

గల్ఫ్‌లో క్షిపణుల మోత  
మరోవైపు యుద్ధం గురువారం 27వ రోజుకు చేరుకుంది. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ సహా ఇతర నగరాలపై ఇజ్రాయెల్‌ సైన్యం క్షిపణుల వర్షం కురిపించింది. ఇరాన్‌సైతం ప్రతీకార దాడులు కొనసాగించింది. ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్‌ దేశాలే లక్ష్యంగా మిస్సైళ్లు, డ్రోన్లు ప్రయోగించింది. ఇరాన్‌ మౌలిక సదుపాయాలపై దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇరాన్‌ సైనిక స్థావరాలకు కేంద్రమైన ఇస్పహాన్‌లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. తమ దాడుల్లో ఇరాన్‌ ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డు కోర్‌(ఐఆర్‌జీసీ) నేవీ చీఫ్‌ అలీ రెజా తంగ్సిరి అంతమైనట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తేల్చిచెప్పారు. 

యుద్ధంలో ఉమ్మడి లక్ష్య సాధన విషయంలో అమెరికా, ఇజ్రాయెల్‌ మధ్య సమన్వయానికి ఈ ఆపరేషన్‌ మరో ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లోనూ శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెప్పారు. ఇజ్రాయెల్‌లోని నహరియా ఏరియాలో ఇరాన్‌ దాడుల్లో ఒకరు మరణించినట్లు తెలిసింది. మరో ఏడుగురు గాయపడినట్లు సమాచారం. ఇరాన్‌లోనూ మృతుల సంఖ్య పెరుగుతోంది. యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటిదాకా 1,900 మందికిపైగా మరణించినట్లు ఇరాన్‌ మంత్రి అలీ జఫారియన్‌ చెప్పారు. ఇజ్రాయెల్‌లో 18 మంది, లెబనాన్‌లో ముగ్గురు ఇజ్రాయెల్‌ జవాన్లు, 1,100 మంది సాధారణ ప్రజలు, గల్ఫ్‌ దేశాల్లో 13 మంది అమెరికా సైనికులు మృతిచెందారు. లెబనాన్‌లో హెజ్‌బొల్లా మిలిటెంట్లను ఖతం చేయడమే ధ్యేయంగా ఇజ్రాయెల్‌ తమ సైన్యాన్ని అక్కడికి తరలిస్తోంది.  

భారతీయుడు సహా ఇద్దరి బలి  
అబూదాబీపై ఇరాన్‌ భారీగా క్షిపణులు ప్రయోగించింది. యూఈఏ గగనతల వ్యవస్థ వాటిని గాల్లోనే నిర్వీర్యం చేసే క్రమంలో విషాదం చోటుచేసుకుంది. క్షిపణుల శకలాలు నేలకూలి మంటలు చెలరేగడంతో ఒక భారతీయుడు సహా ఇద్దరు మరణించారు. మరో భారతీయు డు సహా ముగ్గురు గాయపడ్డారు. మృతిచెందిన రెండో వ్యక్తిని పాకిస్తాన్‌ జాతీయుడిగా గుర్తించారు. పశ్చిమాసియా యుద్ధంలో మృతుల సంఖ్య 11కు చేరుకుంది. 169 మంది గాయపడ్డారు. ఇరాన్‌ నుంచి ఎలాంటి ముప్పు ఎదురైనా తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు అబూ దాబీ రక్షణ శాఖ  ప్రకటించింది.    

ఇరాన్‌లో 10 వేల టార్గెట్లపై దాడులు  
ఇరాన్‌లో ఇప్పటిదాకా 10 వేలకుపైగా టార్గెట్లపై దాడులు చేసినట్లు అమెరికా సైన్యానికి చెందిన సెంట్రల్‌ కమాండ్‌ చీఫ్‌ బ్రాడ్‌ కూపర్‌ వెల్లడించారు. ఇజ్రాయెల్‌తో కలిసి మరిన్ని లక్ష్యాలపై గురి పెడతామని అన్నారు. కచ్చితత్వంతో కూడిన దాడులతో ఇరాన్‌ గగనతల రక్షణ వ్యవస్థపై పైచేయి సాధిస్తున్నామని చెప్పారు. ఇరాన్‌ నావికాదళంలో 92 శాతం భారీ నౌకలను ధ్వంసం చేశామని తెలిపారు.  తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అమెరికా తమ సైన్యాన్ని పశ్చిమాసియాకు తరలిస్తోంది. యూఎస్‌ఎస్‌ ట్రిపోలి సహా పలు  నౌకలు పశ్చిమాసియా సమీపానికి చేరుకుంటున్నాయి. వీటిలో 2,500 మంది జవాన్లు ఉన్నారు. అలాగే 1,000 మంది పారాట్రూపర్లు కూడా రంగంలోకి దిగుతున్నారు.   

సంధానకర్తగా పని చేస్తున్నాం: పాక్‌  
పశ్చిమాసియాలో సంక్షోభ పరిష్కారానికి చర్చలు, దౌత్య మార్గాలే శరణ్యమని పాకిస్తాన్‌ ఉప ప్రధానమంత్రి ఇషాక్‌ దార్‌ చెప్పారు. యుద్ధానికి తెరదించడమే లక్ష్యంగా అమెరికా, ఇరాన్‌ మధ్య తాము సంధానకర్తగా పని చేస్తున్నట్లు గురువారం తెలిపారు. ఒక దేశం సందేశాన్ని మరో దేశానికి చేరవేస్తున్నామని పేర్కొన్నారు. శాంతి సాధన విషయంలో తుర్కియే, ఈజిప్టు కూడా తమకు సహకరిస్తున్నాయని వెల్లడించారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం కోసం తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టంచేశారు.

అంచెలంచెలుగా ఉన్నతస్థాయికి
అలీ రెజా తంగ్సిరి మృతితో ఇరాన్‌కు భారీ నష్టం  
జెరూసలేం: ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అత్యంత శక్తివంతమైన ఇరాన్‌ ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కోర్‌(ఐఆర్‌జీసీ) నావికాదళం చీఫ్‌ అలీ రెజా తంగ్సిరి మృతిచెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ మంత్రి కట్జ్‌ స్వయంగా ప్రకటించారు. ఇరాన్‌లోని తీరప్రాంత నగరమైన బందర్‌ అబ్బాస్‌లో వైమానిక దాడుల్లో తంగ్సిరితోపాటు ఐఆర్‌జీసీకి చెందిన ఇతర సీనియర్‌ నావల్‌ కమాండర్లు కూడా హతమైనట్లు తెలిపారు. అయితే, దీనిపై ఇరాన్‌ ఇంకా స్పందించలేదు.

 హార్మూజ్‌ జలసంధి మూసివేతను తంగ్సిరి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అలాంటి కీలక అధికారి మృతిచెందడం ఇరాన్‌కు భారీ నష్టంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తంగ్సిరి దక్షిణ ఇరాన్‌లోని బుషెహర్‌ ప్రావిన్స్‌లో 1962లో జన్మింంచారు. 1980వ దశకంలో ఇరాన్‌–ఇరాక్‌ యుద్ధంలో పాల్గొన్నారు. ఇరాన్‌ సైన్యంలో అంచెలంచెలుగా పైకి ఎదిగారు. 2010 నుంచి 2018 దాకా ఐఆర్‌జీసీ నేవీ డిప్యూటీ కమాండర్‌గా పనిచేశారు. అనంతరం ఈ దళం అధినేతగా బాధ్యతలు చేపట్టారు. అమెరికా–ఇజ్రాయెల్‌ దాడులు మొదలైన తర్వాత హార్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేసింది. 

అక్కడ విదేశీ నౌకల రాకపోకలను అడ్డుకుంటోంది. ఇదంతా తంగ్సిరి నేతృత్వంలోనే జరిగింది. ఇజ్రాయెలీలు యూదులని, అమెరికన్లు క్రైస్తవులని, వారు తమకు మిత్రులు కాదని మత గ్రంథం ఖురాన్‌ బోధిస్తోందని ఒక సందర్భంలో తంగ్సిరి వ్యాఖ్యానించారు. యుద్ధంలో ఇరాన్‌ కీలక నేతలు, అధికారులు ఒక్కొక్కరుగా మరణిస్తుండడం ఆ దేశానికి నష్టదాయకంగా పరిణమించింది. ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ, సెక్యూరిటీ చీఫ్‌ అలీ లారిజానీ, ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధి అలీ మొహమ్మద్‌ నైనీ తదితరులు మృతిచెందిన సంగతి తెలిసిందే.  

తంగ్సిరి చేతులకు చాలా రక్తం అంటింది: నెతన్యాహు  
అలీ రెజా తంగ్సిరి మృతిని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు సైతం ధ్రువీకరించారు. ఈ మేరకు వీడియో స్టేట్‌మెంట్‌ విడుదల చేశారు. బుధవారం రాత్రి ఐఆర్‌జీసీ నేవీ కమాండర్‌ తంగ్సిరిని అంతం చేసినట్లు తెలిపారు. అతడి చేతులకు చాలా రక్తం అంటిందని, హార్మూజ్‌ జలసంధిని మూసివేయడానికి నాయకత్వం వహించింది కూడా అతడేనని తేల్చిచెప్పారు. ఇరాన్‌ నేతలు, అధికారులే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇరాన్‌ ఉగ్రవాద పాలనపై దాడులు ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.  

ఒప్పందం కోసం ఇరాన్‌ బతిమాలుతోంది: ట్రంప్‌  
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించిన 15 సూత్రాల కాల్పుల విరమణ ప్రణాళికను ఇరాన్‌ రెండో మాటకు తావులేకుండా తిరస్కరించింది. దీనిపై ట్రంప్‌ గురువారం స్పందించారు. ఒప్పందం కోసం ఇరాన్‌ తమను బతిమాలుతోందని అన్నారు. చర్చల కోసం తాను ఒత్తిడి చేయడం లేదని చెప్పారు. యుద్ధాన్ని ముగించే ఒప్పందంపై జరిగే చర్చలను సీరియస్‌గా తీసుకోవాలని టెహ్రాన్‌కు సూచించారు. ఇరాన్‌ ఒక బహుమతి ఇచ్చిందని ట్రంప్‌ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ బహుమతి ఏమిటన్నది ఇప్పుడు బయటపెట్టారు. 10 చమురు నౌకలు హార్మూజ్‌ గుండా వెళ్లడానికి ఇరాన్‌ అనుమతి ఇచ్చిందని చెప్పారు. చర్చల విషయంలో ఇదొక సానుకూల ముందడుగు అని అభివరి్ణంచారు. అనుమతి పొందిన నౌకలు పాకిస్తాన్‌కు చెందినవిగా ట్రంప్‌ సంకేతాలిచ్చారు. తదుపరి సుప్రీంలీడర్‌గా ఉండాలంటూ ఇరాన్‌ తనను వేడుకుందని, అందుకు తిరస్కరించానని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఆ పదవి తనకు ఇష్టం లేదన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement