హైదరాబాద్‌లో కొట్టుకుపోతున్న సిగ్నల్‌.. నిజమెంత?

Fact Check Of Viral Clip Of Traffic Signal Floating In Floodwater - Sakshi

ఇటీవల వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్‌లో రెండు రోజులపాటు కురిసిన భారీ వర్షాలు మహా నగరాన్ని ముంచెత్తిన విషయం తెలిసిందే. నగరంలో కురిసిన వర్షానికి వరదనీరు వీధుల వెంట ఏరులై పారింంది. లోతట్టు ప్రాంతంలోని ఇళ్లలకు వర్షపునీరు చేరడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు కొంతమంది నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి విగతా జీవులుగా మారారు. ఈ క్రమంలో నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్న దృశ్యాలు, వరద నీళ్లలో కార్లు ఇతర వాహనాలు నీళ్లలో కొట్టుకుపోయిన దృశ్యాలు... ఇలా వర్ష బీభత్సానికి సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. చదవండి: వందేళ్ల క్రితం చ‌నిపోయిన వ్యక్తి న‌వ్వుతున్నాడా?

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వరదలకు ఒకచోట ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ కూడా కొట్టుకుపోతున్నట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. ‘చరిత్రలో మొట్టమొదటిసారి ఓ ట్రాఫిక్ సిగ్నల్ రోడ్డు దాటడం చూస్తున్నాను’ ఓ నెటిజన్ షేర్‌ చేశారు. ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను ఆకర్షించడంతో నిజమేనని నమ్మి అనేకమంది విభిన్న సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పోస్టు చేస్తున్నారు. అయితే హైదరాబాద్‌లో వరద నీటికి నిజంగానే ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ కొట్టుకుపోయిందా అని కొంతమందికి అనుమానం వచ్చింది. తాజాగా ఈ వీడియో గురించి ఇండియా టుడే యాంటీ ఫేక్‌ న్యూస్‌ వార్‌ రూమ్‌ క్లారిటీ ఇచ్చింది. ఇది హైదరాబాద్‌లోది కాదని రెండేళ్ల క్రితం(2018) చైనాలో యులిన్‌ నగరానికి చెందినదని స్పష్టం చేసింది. వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే షాపుల్లో సైన్‌ బోర్డులు, బైక్‌ వెనకాల ఉన్న స్టికర్‌పై చైనీస్‌ భాష ఉందని వీటన్నింటిని ఆధారాలుగా పేర్కొంది. చదవండి: 'ఆ ఫోటో నాదే.. నేను చనిపోలేదు'

ఇన్విడ్ టూల్‌ను ఉపయోగించి, రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను ఉపయోగించి దీనికి చెందిన అసలైన వీడియోను మే 11, 2018 న చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్‌వర్క్ యూట్యూబ్ ఛానెల్ అప్‌లోడ్ చేసినట్లు కనుగొన్నారు. మరో విషయం ఏంటంటే గతేడాది కూడా ముంబైలో భారీ వర్షాలు కురిసిన సమయంలోనూ ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టిందని ఇండియా టుడే యాంటీ ఫేక్‌ న్యూస్‌ వార్‌ రూమ్‌ తెలిపింది. కాగా 2018 లో కురిన భారీ వర్షాల కారణంగా గువాంగ్జీ జువాంగ్‌లో 70,000 మంది ప్రజలు ప్రభావితమయ్యారని చైనా మీడియా పేర్కొంది.

వాస్తవం : హైదరాబాద్‌ వరదల్లో ట్రాఫిక్ సిగ్నల్ కొట్టుకుపోతున్నట్లుగా  చూపించిన  వీడియో హైదరాబాద్‌కు చెందినది కాదు. చైనాలోని యులిన్ నగరంలోనిది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top