ఆక్సిజన్‌ అంతమైన వేళ...

Earth first known mass extinction happened over 500 million years ago - Sakshi

టొరంటో: దాదాపు 50 కోట్ల ఏళ్ల క్రితం. భూమిపై ఆక్సిజన్‌ ఉన్నట్టుండి ఎవరో పీల్చేసినట్టుగా సంపూర్ణంగా ఆవిరైపోయింది. దాంతో చాలా జీవరాశులూ ఉన్నపళంగా కళ్లు తేలేశాయి. ఉనికినే కోల్పోయాయి. భూగోళంపై తొలి జీవ వినాశనం జరిగిన తీరు ఇదేనని శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు. భూమిపై తొలి జీవ వినాశనం జరిగిన తీరును అర్థం చేసుకునేందుకు, ఫలితంగా పూర్తిగా నశించిపోయిన జీవరాశులు ఎలా ఉండేవో తెలుసుకునేందుకు పరిశోధకులు శిలాజ ముద్రలను అధ్యయనం చేశారు. ఆ వినాశనమే చాలా జంతు జాతులు ఇప్పుడున్న రూపాల్లో వికసించేందుకు పురిగొల్పి ఉంటుందని వారు భావిస్తున్నారు.

ఆక్సిజన్‌ ఏమైపోయింది?
ఇందుకు ఫలానా సంఘటనే కారణమని కచ్చితంగా చెప్పలేకపోయినా, అది అప్పట్లో జరిగిన అనేకానేక పరిణామాల ఫలస్వరూపం అయ్యుండొచ్చన్నది పరిశోధక బృందం అభిప్రాయం. ‘‘అగ్నిపర్వతాల పేలుడు, భూ ఫలకాల్లో భారీ కదలికలు, గ్రహశకలాలు ఢీకొనడం వంటివాటి వల్ల భూమిపై ఆక్సిజన్‌ బాగా తగ్గిపోవడమో, లుప్తం కావడమో జరిగి ఉంటుంది’’ అని అధ్యయనానికి సారథ్యం వహించిన వర్జీనియా టెక్‌ కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌కు చెందిన పరిశోధకుడు స్కాట్‌ ఇవాన్స్‌ అభిప్రాయపడ్డారు. ‘‘గ్లోబల్‌ వార్మంగ్‌ వంటివి ఆక్సిజన్‌ స్థాయిలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే మరో సామూహిక జీవ హననం దగ్గర్లోనే ఉంది’’ అని హెచ్చరించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top