Ukraine Crisis: ఇది పుతిన్‌ సైతం ఊహించని పరిణామం, ఉక్రెయిన్‌ చేష్టలు భేష్‌ అంటూ..

Donald Trump Praise Putin Over Ukraine Crisis - Sakshi

Russia-Ukraine Crisis: ఉక్రెయిన్‌ పరిణామాలను ప్రపంచం ఒకవైపు ఆసక్తిగా గమనిస్తోంది. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై పాశ్చాత్య దేశాలు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నాయి. ఉక్రెయిన్ పై యుద్ధానికి తహతహలాడుతున్నాడంటూ తిట్టిపోస్తున్నాయి. ఈ తరుణంలో ఊహించని ప్రశంసలు పుతిన్‌పై పడ్డాయి. చేసింది ఎవరో కాదు.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.

ఉక్రెయిన్‌ పరిణామాల ఆధారంగా.. పుతిన్ మహా మేధావి అంటూ వ్యాఖ్యానించాడు ట్రంప్‌. రైట్‌ వింగ్‌ రేడియో ప్రోగ్రామ్‌.. ది క్లే ట్రావిస్ అండ్ బక్ సెక్స్టాన్ షోలో పాల్గొన్న ట్రంప్‌, పుతిన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  పుతిన్‌ గురించి నాకు బాగా తెలుసు. అతని నాకు మంచి స్నేహితుడు. మహా మేధావి కూడా. ఉక్రెయిన్ లోని డానెట్స్క్, లుహాన్స్క్ లను స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించడం తెలివైన చర్య అంటూ పేర్కొన్నాడు ట్రంప్‌. 

‘‘ఉక్రెయిన్ లోని భారీ భూభాగాన్ని స్వతంత్ర రాజ్యాలుగా పుతిన్ ప్రకటించడాన్ని టీవీలో చూశా. వావ్‌.. అది అద్భుతమైన చర్య అన్నారు. ఆ నిర్ణయం ఎంత తెలివైనదంటే.. రెండు స్వతంత్ర రాజ్యాలుగా విడగొట్టి పుతిన్ శాంతి కాముకుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఉక్రెయిన్‌ సరిహద్దులో మోహరింపు.. అత్యంత శక్తిమంతమైన శాంతి కాముక బలగమ’ని ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. పుతిన్‌ చేపట్టిన తరహా చర్యలు.. అమెరికా దక్షిణాది సరిహద్దుల్లోనూ అవసరమని ట్రంప్‌ అభిప్రాయపడ్డాడు.

ఇక పుతిన్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని, ఆయన గురించి తనకు బాగా తెలుసని ట్రంప్ చెప్పారు. తన హయాంలో ఇలాంటి పరిణామాలేవి జరగలేదని, కానీ, ఇప్పుడు జరుగుతున్నాయన్నారు. మొత్తంగా పుతిన్‌ కూడా ఈ పొగడ్తలను ఊహించి ఉండడు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌ పరిణామాలతో ఇప్పటికే అమెరికా, బ్రిటన్, కెనడా, ఐరోపా దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top