ఆవు పేడతో మంచినీళ్లు.. ఎలా తయారు చేస్తారో తెలుసా?

Cow Manure Turned Into Filter to Make Drinking Water from Salt Water - Sakshi

భూమి ఉపరితలంపై 70శాతానిపైగా నీళ్లే. అయినా తాగేనీటికి కరువే. కానీ సముద్రాల ఉప్పునీటిని ఆవు పేడ సాయంతో మంచినీటిగా మార్చే సరికొత్త టెక్నాలజీకి శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. ఎండను ఆధారంగా చేసుకుని.. పెద్దగా ఖర్చేమీ లేకుండానే.. మంచినీటిని తయారు చేసుకోవచ్చని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కష్టాలు తీర్చే ఈ పరిశోధన వివరాలేమిటో తెలుసుకుందామా..  

నీటి కరువులో 142 కోట్ల మంది 
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కలిపి సుమారు 142 కోట్ల మంది నీటి కరువుతో బాధపడుతున్నట్టు ఐక్యరాజ్యసమితి అంచనా. పక్కనే సముద్రాలు ఉన్నా.. తాగేనీటి కోసం ఇబ్బందిపడే ప్రాంతాలు ఎన్నో. అలాంటి చోట్ల ఉప్పునీటిని మంచినీటిగా మార్చుకుని వినియోగించాల్సిన పరిస్థితి. దీనికోసం భారీగా వ్యయం అవుతుంది. అమెరికాలోని నార్త్‌ఈస్టర్న్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ సమస్యకు పరిష్కారం చూపడంపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే ఆవుపేడతోపాటు మరికొన్ని ఇతర పదార్థాలతో నీటిని శుద్ధిచేసే సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. 
చదవండి: వయసు వందకు పైనే.. ‘ఔరా’ అనిపిస్తున్న బామ్మలు

సూర్యరశ్మితో నీటిని వేడి చేసి.. 
శాస్త్రవేత్తలు ఫోమ్‌ను సముద్రపు ఉప్పునీటిపై ఉంచి ఎండతగిలేలా ఏర్పాటు చేశారు. నీటిపై తేలుతున్న ఫోమ్‌ సూర్యరశి్మని శోషించుకుని వేడెక్కడం మొదలుపెట్టింది. ఆ వేడి సూక్ష్మగొట్టాల ద్వారా దిగువన నీటికి చేరింది. అక్కడ నీరు ఆవిరై.. దానిలోని ఉప్పు, ఇతర లవణాలు విడిపోయాయి. స్వచ్ఛమైన నీరు, ఆవిరి సూక్ష్మగొట్టాల ద్వారా ఫోమ్‌ పైభాగానికి వచ్చాయి. శాస్త్రవేత్తలు పలు పరికరాలను ఫోమ్‌కు అనుసంధానం చేసి ఆ నీటిని సేకరించారు. దానిలో లవణాలు, ఇతర అంశాలను పరీక్షించి.. తాగడానికి పూర్తి అనుగుణంగా ఉన్నట్టు గుర్తించారు.
చదవండి: ఆవు మాత్రమే అలా చేయగలదు: అలహాబాద్‌ హైకోర్టు వ్యాఖ్యలు

ఫోమ్‌లా రూపొందించి.. 
శాస్త్రవేత్తలు ఆవు పేడతోపాటు ఎండిపోయిన ఆకులు, పీతలు, నత్తల షెల్స్‌ను కలిపి.. తీవ్ర ఒత్తిడి వద్ద 1,700 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత వరకు వేడిచేశారు. దీనితో ఈ పదార్థాల్లోని బ్యాక్టీరియా, వైరస్, ఇతర సూక్ష్మజీవులు నశించి.. పొడి కర్బన పదార్థం ఏర్పడింది. ఈ కర్బన పదార్థానికి అత్యంత చిక్కని నలుపు రంగును ఇచ్చే ‘కెటిల్‌ ఫిష్‌’ఇంకును కలిపారు. ఈ మిశ్రమంతో ఫోమ్‌ (గుల్లగా ఉండే డస్టర్‌ వంటి అతితేలికైన పదార్థం)ను తయారుచేశారు. అత్యంత సూక్ష్మమైన గొట్టాల వంటి నిర్మాణంతో ఉండే ఈ ఫోమ్‌.. నీటిని సమర్థవంతంగా పీల్చుకోవడంతోపాటు ఉపరితలంపై తేలుతూ ఉంటుంది.

ఉప్పునీటి శుద్ధికి యంత్రాలున్నా..
► ఉప్పునీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియను డీసాలినేషన్‌ అంటారు. ఇందుకోసం ఇప్పటికే పలు విధానాలు ఉన్నాయి. కానీ అందులో వాడే ఫిల్టర్ల ధర ఎక్కువ. చాలా విద్యుత్‌ అవసరమవుతుంది. దీనివల్ల నీటి శుద్ధికి చాలా ఎక్కువ ఖర్చవుతుంది. పర్యావరణానికి కూడా నష్టం కలిగిస్తుంది. అందుకే గల్ఫ్, ఇతర ధనిక దేశాలు మినహా ఎక్కడా ఈ పరికరాలను వినియోగించడం లేదు 
► తాజాగా నార్త్‌ఈస్టర్న్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన ఫోమ్‌ తయారీలో పూర్తిగా వ్యర్థాలనే వాడటం, విద్యుత్‌ అవసరం లేకపోవడంతో.. ఖర్చు తక్కువ. ఈ విధానాన్ని అంతటా వినియోగించవచ్చని, కోట్లాది మంది కష్టాలు తీరుతాయని శాస్త్రవేత్త యిజెంగ్‌ తెలిపారు. 
► ప్రపంచవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో బావులు, చెరువుల్లో నీళ్లు ఉన్నా నేరుగా తాగలేం. వాటిలో లవణాల శాతం ఎక్కువగా ఉండటంతోపాటు బ్యాక్టీరియా, వైరస్‌లు, ఇతర సూక్ష్మజీవులతో కలుíÙతం అయి ఉండే అవకాశాలు ఎక్కువ. అలాంటిచోట్ల కూడా ఈ కొత్త విధానంలో నీటిని శుద్ధి చేసుకుని తాగవచ్చని యిజెంగ్‌ పేర్కొన్నారు.   
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top