కరోనా వైరస్‌.. మానవ నిర్మితమే 

Covid Was Man Made Virus Says Scientist Who Worked At Wuhan Lab - Sakshi

వూహాన్‌ ల్యాబ్‌ సైంటిస్టు ఆండ్రూ హఫ్‌ వెల్లడి  

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలితీసుకున్న కరోనా వైరస్‌ మానవ నిర్మితమేనని చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌లో పని చేసిన అమెరికా శాస్త్రవేత్త, ఎపిడెమియాలజిస్ట్‌ ఆండ్రూ హఫ్‌ చెప్పారు. తాజాగా విడుదల చేసిన తన పుస్తకం ‘ది ట్రూత్‌ ఎబౌట్‌ వూహాన్‌’లో సంచలన విషయాలు బయటపెట్టారు. చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(డబ్ల్యూఐవీ) నుంచి రెండేళ్ల క్రితం కరోనా వైరస్‌ లీక్‌ అయ్యిందని వెల్లడించారు.

చైనా ల్యాబ్‌లో వైరస్‌లపై పరిశోధనలకు అమెరికా ప్రభుత్వం నిధులు సమకూరుస్తోందని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ అనేది జన్యుపరంగా రూపొందించిన ఏజెంట్‌ అని చైనాకు తెలుసని వివరించారు. చైనాకు అమెరికా బయోవెపన్‌ సాంకేతికతను అందజేస్తోందన్నారు. సరైన భద్రతా చర్యలు లేని ప్రయోగాల కారణంగా వూహాన్‌ ల్యాబ్‌ నుంచి కరోనా బయటకు వచ్చిందని స్పష్టం చేశారు.

జీవ భద్రత, బయోసెక్యూరిటీ, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వంటి చర్యలు ఆ ల్యాబ్‌లో లేవని ఆండ్రూ హఫ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌(ఎన్‌ఐహెచ్‌)తో చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు. ఎన్‌ఐహెచ్‌ నుంచి అందే నిధులతో గబ్బిలాల్లోని కరోనా వైరస్‌లపై వూహాన్‌ ల్యాబ్‌ అధ్యయనం చేస్తోందని తన పుస్తకంలో ప్రస్తావించారు.    

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top