గ్లౌజుల కంపెనీలో కరోనా వీర విహారం

Coronavirus: Top Glove Shut Down Its Units - Sakshi

కౌలాలంపూర్‌ : కరోనా లాంటి వైరస్‌ల బారిన పడకుండా ఉండేందుకు ధరించే పీపీఈ (వ్యక్తిగత రక్షణ పరికరాలు) కిట్స్‌ను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేస్తూ ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తోన్న మలేసియాకు చెందిన ‘టాప్‌ గ్లోవ్‌’ కంపెనీలో ఊహించని సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. కంపెనీలో పని చేస్తోన్న 2,453 మంది కార్మికులు కరోనా వైరస్‌ బారిన పడడంతో మలేసియా ప్రభుత్వం ఆదేశాలతో టాప్‌ గ్లోవ్‌ కంపెనీ కౌలాలంపూర్‌కు వెలుపల ఉన్న  28 కంపెనీ యూనిట్లన్నింటిని మూసివేసింది. కరోనా బారిన పడిన కార్మికులను క్వారంటైన్‌లోకి పంపించింది. కార్మికుల కదలలికలను నియంత్రించేందుకు కార్మికుల వసతి గృహం వద్ద ముళ్ల ఇనుప తీగెలను ఏర్పాటు చేసింది.

మొన్నటి వరకు కరోనా కేసులు అతి తక్కువగా ఉన్న మలేసియాలో హఠాత్తుగా కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దేశవ్యాప్తంగా రోజుకు 2,188 కేసులు సగటున వస్తున్నాయని, మంగళవారం నాటికి మలేసియాలో కరోనా కేసులు 58,847కు చేరుకున్నాయని ఆ దేశ ఆరోగ్య శాఖ ఓ అధికార ప్రకటనలో వెల్లడించింది. టాప్‌ గ్లోవ్‌ కంపెనీకి 47 కంపెనీ యూనిట్లు ఉండగా, వాటిలో 41 కంపెనీలు ఒక్క మలేసియాలోనే ఉన్నాయి. థాయ్‌లాండ్, చైనా, వియత్నాం దేశాల్లో మిగతా కంపెనీ యూనిట్లు ఉన్నాయి. అందులో పనిచేసే వారిలో ఎక్కువ మంది నేపాల్‌ నుంచి వచ్చిన వారే. వారంతా కంపెనీకి చెందిన వసతి గృహాల్లో కిక్కిర్సి ఉంటారు. మంగళవారం నాటికి కంపెనీలోని 5,700 మంది కార్మికులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 2,453 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. మొత్తం ఈ కంపెనీల్లో 16 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు.

వలస కార్మికులను టాప్‌ గ్లోవ్‌ కంపెనీ చిన్నచూపు చూస్తోందని కంపెనీ కార్మికులు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. ఈ విషయమై టాప్‌ గ్లోవ్‌కు చెందిన రెండు కంపెనీలను పీపీఈల దిగుమతిని గత జూలై నెలలో అమెరికా రద్దు చేసుకుంది. (కరోనా: భారత దేశంలో ఎందుకు ఇలా అవుతోంది?)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top