కరోనా కారణంగా తగ్గిన కర్బన ఉద్గారాలు | Sakshi
Sakshi News home page

కరోనా కారణంగా తగ్గిన కర్బన ఉద్గారాలు

Published Fri, Dec 11 2020 4:32 PM

Coronavirus: Record Drop In Emissions - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న 2020లో ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గడం కీడులో కలిసొచ్చిన మేలుగా భావించవచ్చు. 2019లో ఈ సమయంలో వాతావరణంలో ఉద్గారాలతో 2020లో ఇదే సమయానికి ప్రపంచ వాతావరణంలో ఉన్న కర్బన ఉద్గారాలను పోల్చి చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా సరాసరి ఏడు శాతం కర్బన ఉద్గారాలు తగ్గిపోయాయి. ఇక్కడ ఏడు శాతమంటే 240 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గాయన్న మాట. 

అన్ని దేశాలకన్నా బ్రిటన్‌లో 13 శాతం తగ్గగా, అమెరికాలో 12 శాతం, యూరోపియన్‌ కూటమి దేశాల్లో 11 శాతం కర్బన ఉద్గారాలు తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 34 గిగా టన్నుల కర్బన ఉద్గారాలు వాతావరణంలో కలుస్తాయి. ఒక్క గిగా టన్ను అంటే వంద కోట్ల టన్నులు. బ్రిటన్‌లో ఏకంగా 13 శాతం కర్బన ఉద్గారాలు తగ్గడానికి ప్రధాన కారణం రవాణా రంగమే. జాతీయ లాక్‌డౌన్‌లను రెండుసార్లు అమలు చేయడం వల్ల ప్రధాన రవాణా రంగం దాదాపు నిలిచిపోయింది.

యూనివర్శిటీ ఆఫ్‌ ఈస్ట్‌ ఆంగ్లియా, యూనివర్శిటీ ఆఫ్‌ ఎక్స్‌టర్‌ లండ్‌ గ్లోబల్‌ కార్బన్‌ ప్రాజెక్ట్‌ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2019, డిసెంబర్‌ నెలలో రోడ్డు రవాణా రంగం నుంచి వెలువడిన కర్బన ఉద్గారాలతో 2020, డిసెంబర్‌లో వెలువడుతున్న కర్బన ఉద్గారాలను పోల్చి నట్లయితే ప్రపంచవ్యాప్తంగా పది శాతం తగ్గాయి. విమానయాన రంగం నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు దాదాపు 40 శాతం తగ్గాయి.కరోనా వైరస్‌ ఆవిర్భవించినట్లు భావిస్తున్న చైనాలో ఆదిలో తగ్గినప్పటికీ మళ్లీ పెరిగాయి. గతేడాదితో పోలిస్తే అక్కడ 1.7 శాతం పెరిగాయి. 

Advertisement
Advertisement