Egypt COP27: పర్యావరణ ప్రతినలు... లక్ష్యానికి ఆమడ దూరం

COP27: 2022 United Nations Climate Change Conference - Sakshi

మితిమీరిన శిలాజ ఇంధనాల వాడకం

ప్రమాదపుటంచుల్లో పర్యావరణం

నేటినుంచి ఈజిప్ట్‌లో కాప్‌–27 సదస్సు

భూమి నానాటికీ వేడుక్కుతోంది. ఒకవైపు తీవ్ర కరువు. మరోవైపు పలు దేశాల్లో కనీవినీ ఎరగని వరదలు సృష్టిస్తున్న పెను బీభత్సం. ఇలాంటి ఉత్పతాలన్నింటికీ కారణం పర్యావరణ మార్పులు. ఇది రానురానూ తీవ్ర రూపు దాలుస్తూ మానవాళిని వణికిస్తోంది. ఎవరేం చెప్పినా, దేశాలు ఎన్ని చేసినా సమస్య నానాటికీ ముదురుతోందే తప్ప పరిస్థితిలో మెరుగుదల మాత్రం కన్పించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణం నానాటికీ విషతుల్యంగా మారుతోంది.

రోజులు గడుస్తున్న కొద్దీ పర్యావరణానికి ముప్పు పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పర్యావరణ మార్పులపై సదస్సు (కాప్‌–27) ఆదివారం ఈజిప్టులో మొదలవుతోంది. 12 రోజుల పాటు జరిగే ఈ సదస్సులోనైనా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకునే దిశగా గట్టి ముందడుగు పడుతుందేమో చూడాలి...

కాగితాల్లోనే ఒప్పందాలు
గతేడాది స్కాట్లండ్‌లోని గ్లాస్గోలో జరిగిన కాప్‌–26లో దేశాలన్నీ మేధోమథనం చేసి గట్టి తీర్మానాలతో పర్యావరణ ఒప్పందమైతే ఆమోదించాయి. దీన్నో పెద్ద సానుకూల చర్యగా ప్రపంచమంతా కొనియాడింది. ఎందుకంటే శిలాజ ఇంధనాల వల్ల పర్యావరణానికి కలుగుతున్న తీవ్ర హానిని అంతర్జాతీయంగా తొలిసారిగా అధికారికంగా గుర్తించింది గ్లాస్గో సదస్సులోనే. వాటి వాడకాన్ని వీలైనంతగా తగ్గిస్తూ క్రమంగా పూర్తిగా నిలిపేయాలని దేశాలన్నింటికీ సదస్సు పిలుపునిచ్చింది. కానీ ఏడాది గడిచినా ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వాడకం నానాటికీ పెరుగుతోందే తప్ప తగ్గకపోవడం శోచనీయం.

పులిమీద పుట్రలా యుద్ధం...
రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం దెబ్బకు పరిస్థితి మరింతగా దిగజారింది. రష్యా నుంచి సహజవాయు సరఫరాలు భారీగా తగ్గిపోవడంతో యూరప్‌ సహా పలు దేశాలు మరో దారి లేక శిలాజ ఇంధనాల వాడకాన్ని పెంచేశాయి. అందులోనూ అత్యంత కాలుష్యకారకమైన బొగ్గు వాడకం విపరీతంగా పెరిగిపోతున్న వైనం కలవరపెడుతోంది. 2022లో బొగ్గు వాడకం 2013లో నమోదైన ఆల్‌టైం రికార్డును చేరడం ఖాయమని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) జోస్యం చెబుతోంది.

ఒక్క యూరోపియన్‌ యూనియన్‌లోనే బొగ్గు డిమాండ్‌ కనీసం 6.5 శాతం పెరుగుతుందని అంచనా. మొత్తమ్మీద 2030 కల్లా అంతర్జాతీయ బొగ్గు వినియోగం 2021తోపోలిస్తే 8.7 శాతానికి మించి తగ్గకపోవచ్చంటున్నారు. ఈ లెక్కన 2050 నాటికి శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా నిలిపేయాలన్న లక్ష్యం చేరడం అసాధ్యమే. అది జరగాలంటే 2030 నాటికి బొగ్గు వాడకం ఏకంగా 35 శాతం తగ్గాల్సి ఉంటుంది!

గతేడాది సదస్సులో వర్ధమాన దేశాలన్నింటినీ బొగ్గు తదితర శిలాజ ఇంధనాలకు గుడ్‌బై చెప్పాలని కోరిన సంపన్న దేశాలే ఇప్పుడు ఆ దేశాలను మించి వాటిని వాడుతుండటం విషాదం. ఈ ధోరణికి వెంటనే అడ్డుకట్ట పడకుంటే 2100 నాటికి భూగోళం ఏకంగా మరో 2.6 డిగ్రీల మేరకు వేడెక్కుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూతాపోన్నతిని 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలన్న గ్లాస్గో ఒప్పందం అమలుకు సదస్సు ఏ చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరం.                      

భద్రతా వలయంలో రిసార్టు
పర్యావరణ కార్యకర్తల నిరసనల భయాల నడుమ సీఓపీ27కు వేదిక కానున్న సినాయ్‌ ద్వీపకల్పంలోని షర్మెల్‌ షేక్‌లోని రిసార్టు వద్ద ఈజిప్టు ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. కోరల్‌ రీఫ్‌లు, అత్యంత అందమైన సముద్ర తీరాలకు ఈ రిసార్టు నిలయం. స్థానికంగా టూరిజంలో పనిచేసే వాళ్లలో చాలామందిని తాత్కాలికంగా ఇళ్లకు పంపారు. మిగతా వారికి ప్రత్యేకమైన గుర్తింపు కార్డులిచ్చారు. సెలవులు గడిపేందుకు వస్తున్న టూరిస్టులను కూడా అడ్డుకుంటున్నారు. గతేడాది గ్లాస్గోలో సదస్సు జరిగిన వీధిలోకి ఏకంగా లక్షలమంది దూసుకొచ్చి నిరసనలకు దిగారు. కాప్‌ సదస్సు 1995 నుంచి ఏటా జరుగుతోంది.

ఆర్థిక, సాంకేతిక సాయాలకు పట్టుబట్టనున్న భారత్‌
వాతావరణ మార్పులు, తద్వారా వస్తున్న విపత్తులను అరికట్టేందుకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సాయాన్ని సంపన్న దేశాలు భారీగా పెంచాలని సదస్సులో భారత్‌ డిమాండ్‌ చేసే అవకాశం కన్పిస్తోంది. మన ప్రతినిధి బృందానికి కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ నేతృత్వం వహిస్తారు. మొత్తం 198 దేశాలు సదస్సులో పాల్గొంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌తో పాటు 100 మందికి పైగా దేశాధినేతలు హాజరవనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడంపై స్పష్టత లేదు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top