
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు పూర్తి చేసింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లు, దేశ ఆర్థిక స్థితిగతులు, చైనాతో సరిహద్దు సంక్షోభం, రాజ్యాంగ వ్యవస్థలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ండటం తదిరాలను సమావేశాల్లో లేవనెత్తాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ శనివారం పార్టీ నాయకురాలు సోనియాగాంధీ నివాసంలో సమావేశమైంది. విపక్షాలతో చర్చించి ఉమ్మడి వ్యూహాన్ని రచిస్తామని పార్టీ నేత జైరాం రమేశ్ మీడియాకు వెల్లడించారు. జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ, ఇతర కీలక నేతలు ఈసారి సమావేశాలకు దూరం కానున్నారు.
నా వ్యాఖ్యల వక్రీకరణ: ఖర్గే
అహ్మదాబాద్: ప్రధాని మోదీని రావణుడని తాను ప్రత్యేకంగా అనాల్సిన పని లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తిప్పికొట్టారు. ‘‘నా వ్యాఖ్యలను వక్రీకరించారు. గుజరాత్‌లో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, బ్యానర్లపై మోదీ ముఖమే. అలా అనేలా చేసుకుంది వాళ్లే’’ అన్నారు. కాంగ్రెస్ ఓట్లను చీల్చి బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు ఆప్ ప్రయత్నిస్తోందన్నారు.