మహావినాశనం ముందుంది? ఖచ్చితమైన అంచనాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు! | Doomsday: What Will Cause Humanity's Demise - Sakshi
Sakshi News home page

Computer predicts: మహావినాశనం ముందుంది?

Published Mon, Nov 6 2023 12:10 PM

Computer Predicts Doomsday What will Cause Humanitys demise - Sakshi

‘యుగాంతం’.. ‘మహావినాశనం’ వీటి​కి సంబంధించిన చర్చలు ‍ప్రపంచంలో కొత్తేమీకాదు. ఈ ఆసక్తికర అంశాలపై పలు సినిమాలు కూడా వచ్చాయి. అయితే తాజాగా మానవాళి అంతం గురించి అంచనా వేయడానికి నిపుణులు, శాస్త్రవేత్తలు అత్యాధునిక సూపర్‌ కంప్యూటర్ను ఉపయోగించారు.  

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మానవాళి భవిష్యత్‌ గురించి కంప్యూటర్‌ రూపొందించిన నివేదికలను అధ్యయనం చేశారు. భూమిమీద మానవజాతి ఎప్పుడు అంతరించిపోతుందో తెలుసుకున్నారు. దీని ప్రకారం యుగాంతం మనకు అత్యంత సమీపంలోనే లేకపోయినప్పటికీ, 250 మిలియన్ సంవత్సరాల (ఒక మిలియన్‌ అంటే పది లక్షలు) దూరంలో ఉన్నట్లు తేలింది. 

అధ్యయనంలో పాల్గొన్న బ్రిస్టల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు డాక్టర్ అలెగ్జాండర్ ఫార్న్స్‌వర్త్ మాట్లాడుతూ భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, విపరీతమైన వేడి కారణంగా మానవాళి మనుగడ దుర్భరంగా మారుతుందని అన్నారు. ఈ విధంగా మరణాలు విపరీతంగా సంభవిస్తాయని తెలిపారు. భవిష్యత్‌లో సూర్యుని నుంచి ఇప్పుడున్న దానికన్నా సుమారు 2.5 శాతం అధిక రేడియేషన్‌ విడుదల కానుంది. ఫలితంగా కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు ఇప్పటి కంటే రెండు రెట్లు అధికం కాగలవని ఆయన హెచ్చరించారు.

ఈ నేపధ్యంలో అగ్ని పర్వత విస్ఫోటనాలతో ఏర్పడే  సూపర్ ఖండం తేమతో కూడిన ఉష్ణమండల ప్రాంతాలను ఆక్రమిస్తుంది. ఫలితంగా భూభాగంలోని అధిక ప్రాంతాల్లో 40 నుండి 70 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశం ఉంది. ఈ నూతన సూపర్ ఖండం మానవాళికి మూడు రెట్ల ముప్పును కలిగిస్తుంది. మానవులు, జంతువులు, క్షీరదాలకు అననుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. పెరిగే రోజువారీ ఉష్ణోగ్రత తీవ్రతలు, అధిక తేమ స్థాయిలు కలసి మానవుల మనుగడకు అంతం పలకుతాయని ఫార్న్స్‌వర్త్ హెచ్చరించారు. 

అయితే ఈ విపత్తును నివారించడానికి శిలాజ ఇంధనాల వినియోగాన్ని నిలిపివేయడం ఒక్కటే మార్గమని ఆయన తెలిపారు. లీడ్స్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ బెంజమిన్ మిల్స్ మాట్లాడుతూ శిలాజ ఇంధన వినియోగంలో పెరుగుదల భూమిపై మానవాళి అంతాన్ని వేగవంతం చేస్తుందని, ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగితే ఊహించిన దానికంటే ముందుగానే మానవాళి అంతానికి చేరుకోవచ్చని అన్నారు. భవిష్యత్‌లో భూమిపై నివాసయోగ్యంకాని  సూపర్ ఖండం ఏర్పడినప్పుడు సంభవించే పరిణామాలు ఎలావుంటాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు సూపర్ కంప్యూటర్లను వినియోగించి అధునాతన వాతావరణ నమూనాలను తెలుసుకునేందుకు పరిశోధనలు సాగిస్తున్నారు. 
ఇది కూడా  చదవండి: రష్యా అధికారిక కార్యక్రమాల్లో పుతిన్‌ డూప్‌? క్రెమ్లిన్ ఏమంటోంది?

Advertisement
Advertisement