
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ జూన్ 13న ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ను మొదలుపెట్టి, ఇరాన్‌కు చెందిన సైనిక, అణు సౌకర్యాలపై బాంబు దాడి చేయడంతో ప్రారంభమైన ప్రాంతీయ ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో ఇరాన్‌లోని భారత పౌరులు అనవసర ప్రయాణాలను మానుకోవాలని కోరింది.
గత కొన్ని వారాలుగా ఇరాన్‌లో పెరుగుతున్న భద్రతా సమస్యల మధ్య ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ ప్రకటన చేసింది. ‘గత కొన్ని వారాలుగా నెలకొన్న భద్రతా సంబంధిత పరిణామాల దృష్ట్యా, ఇరాన్‌లో అనవసరమైన ప్రయాణాలు చేపట్టే ముందు ఇక్కడి పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించాలని భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్’లో సూచించింది. ఇరాన్‌లో ఇప్పటికే ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాలు, ఫెర్రీలను వినియోగించుకోవచ్చని తెలిపింది.
— India in Iran (@India_in_Iran) July 15, 2025
ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ను ప్రారంభించి ఇరాన్‌పై దాడులకు తెగబడిన దరిమిలా ఇరాన్ ఇజ్రాయెల్‌పై క్షిపణి, డ్రోన్ దాడులతో ప్రతీకారం తీర్చుకుంది. జూన్ 24న ఇజ్రాయెల్ తన దురాక్రమణను ఏకపక్షంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో 12 రోజుల ఈ యుద్ధం ముగిసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.