వైద్య రంగానికే సవాల్‌గా హవానా.. భారత్‌లో వెలుగులోకి

CIA Officer Suffers Havana Syndrome Symptoms in India - Sakshi

హవానా.. హైరానా

భారత్‌లో తొలిసారిగా బయటకి వచ్చిన కేసు 

అమెరికా దౌత్య సిబ్బందిపై హవానా సిండ్రోమ్‌ దాడి

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ: అమెరికా దౌత్యప్రతినిధులు, గూఢచారులకు సోకుతూ వైద్య రంగానికే సవాల్‌ విసిరిన హవానా సిండ్రోమ్‌ మొట్టమొదటిసారిగా భారత్‌లో వెలుగు చూసింది. ఈ నెల మొదటి వారంలో భారత్‌ పర్యటనకు వచ్చిన అమెరికా సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ)కి చెందిన అధికారి హవానా సిండ్రోమ్‌ లక్షణాలతో బాధపడినట్టుగా ఆలస్యంగా బయటపడింది.  తిరిగి వెళ్లిన వెంటనే ఆయనకు వైద్యం అందించినట్టు  సీఎన్‌ఎన్‌ వెల్లడించింది. గత నెలలో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ వియత్నాం పర్యటనకు వెళ్లడానికి ముందు ఆ దేశంలోని అమెరికా రాయబారులు ఇద్దరికి ఈ సిండ్రోమ్‌ సోకడంతో వెంటనే స్వదేశానికి తీసుకు వచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200 మంది అమెరికా అధికారులు, వారి కుటుంబీకులు ఈ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. 2017లో క్యూబాలోని అమెరికా రాయబార కార్యాలయం సిబ్బందిలో తొలిసారిగా ఈ వ్యాధి లక్షణాలు మైగ్రేన్‌ తరహాలో తలనొప్పి, అలసట, కడుపులో వికారం, నిద్రమత్తు, చెవుల్లో వింత శబ్దాలు, తలతిరగడం కనిపించాయి. ఎందుకు సోకుతోందో ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు.  

రష్యా దాడి చేస్తోందా ?
రష్యా నిఘా వర్గాలు అల్ట్రాసోనిక్‌ వెపన్స్‌ వాడడం ద్వారా అమెరికా ఇంటెలిజెన్స్‌ ప్రతినిధులపై దాడి చేస్తున్నాయని, అందువల్లే నరాల బలహీనత, మానసిక సమస్యలు వెంటాడుతున్నాయనే అనుమానాలున్నాయి. 

అమెరికా ఏమంటోంది ? 
ఇటీవల కాలంలో అమెరికా దౌత్య ప్రతినిధుల్లో ఈ తరహా లక్షణాలు బయటకు రావడం సర్వసాధారణంగా మారిందని సీఐఏ డైరెక్టర్‌ విలియమ్‌ బర్న్స్‌ బృందంలోని ఒక మహిళా ప్రతినిధి వెల్లడించారు. ఎక్కువ మందిలో వైద్యం అందిన వెంటనే ఈ లక్షణాలు సర్దుకుంటున్నాయని కొందరిలో మాత్రం శాశ్వతంగా మెదడు దెబ్బతింటోందని తెలిపారు. ఈ సిండ్రోమ్‌ ఎందుకు సోకుతోందో నిగ్గు తేల్చడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఆమె వివరించారు. అమెరికాలో పలువురు న్యూరాలజిస్టులు ఇది మానసిక ఒత్తిడికి సంబంధించిన వ్యాధిగా చెబుతున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top