అలీబాబాకు మరో ఎదురుదెబ్బ

Chinese regulators order Ant Group to rectify its businesses - Sakshi

వ్యాపారాలను సరిదిద్దుకోవాలని యాంట్‌ గ్రూపునకు చైనా రెగ్యులేటరీ సంస్థ ఆదేశాలు

బీజింగ్‌ : ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థికసాంకేతిక సంస్థ యాంట్ గ్రూప్, చైనాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. దేశంలోని ఇంటర్నెట్ రంగంలో గుత్తాధిపత్య  వ్యతిరేక పద్ధతులపై పెరిగిన పరిశీలనల మధ్య తన వ్యాపారాలను సరిదిద్దుకోవాలని, నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని రెగ్యులేటరీ సంస్థలు ఆదేశించాయి. ఈ మేరకు విచారణకు ఆదేశించాయి.ఐపీఓ నిలిపివేత ద్వారా ఇబ్బందులు పడ్డ ప్రముఖ పారిశ్రామికవేత్త అలీబాబా, యాంట్ గ్రూప్  వ్యవస్థాపకుడు జాక్ మాకు మరోసారి భారీ షాక్‌ తగిలింది.

ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీని స్థాపించి, తగినంత మూలధనాన్ని కలిగి ఉండాలని రెగ్యులేటర్లు యాంట్ గ్రూప్‌ను ఆదేశించారు. కార్పొరేట్ పాలనను మెరుగుపరిచేటప్పుడు, దాని వ్యాపారాల నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటూ, యాంట్ గ్రూప్ దాని చెల్లింపుల మూలానికి తిరిగి రావాలని, లావాదేవీల చుట్టూ పారదర్శకతను పెంచుకోవాలని, అన్యాయమైన పోటీని నిషేధించాలని వారు చెప్పారు. రెగ్యులేటరీ అవసరాలకు అనుగుణంగా ఉంటామని, రిస్క్ మేనేజ్‌మెంట్, నియంత్రణను మెరుగుపరుస్తామని, అవసరమైన దిద్దుబాట్లు చేయడానికి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేస్తామని యాంట్ గ్రూప్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

 గత నెలలో ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవో  (37 బిలియన్ డాలర్ల) ప్లాన్ చేసింది కంపెనీ. షాంఘైతో పాటు, హాంకాంగ్ స్టాక్‌మార్కెట్లలో డెబ్యూ లిస్టింగ్‌కు ప్రయత్నించింది.  అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు  దీన్ని అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ షాక్ నుంచి కోలుకోకముందే యాంట్‌ గ్రూపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో విచారణకు ఆదేశించారు. తాజా నిర్ణయంతో కంపెనీ షేరు 6శాతం పడిపోయింది. మార్కెట్ నిబంధనలకు విరుద్దంగా మోనోపలిగా కంపెనీ వ్యవహరిస్తుందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. పోటీతత్వం లేకుండా కస్టమర్లకు ఆప్షన్ లేకుండా చేస్తోందనేది ప్రధాన ఆరోపణ. దీనిపై చైనా ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోంది.  మరోవైపు అలీబాబా మాతృ సంస్థ  యాంట్ మనదేశంలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టింది. బిగ్ బాస్కెట్, స్విగ్గీ వంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top