తండ్రిబాటలో నడిచి..చరిత్ర సృష్టించి.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రస్థానమిదే..

Chinese President Xi Jinping and his childhood special story - Sakshi

చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ 1953 జూన్‌ 15న శాన్‌షీ ప్రావిన్స్‌లో జన్మించారు. ఆయన తండ్రి షీ షీ ఝాంగ్‌షువాన్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ నాయకుడిగా, చైనా ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. జిన్‌పింగ్‌ బాల్యం ఎక్కువగా యావోడాంగ్‌ అనే పల్లెటూరిలో గడిచింది. తండ్రి ఆదేశాల మేరకు సాంస్కృతిక విప్లవ సమయంలో రైతులతో కలిసి సాధారణ జీవితం గడిపారు. వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నారు. ప్రాథమిక విద్య అనంతరం సింగువా యూనివర్సిటీలో కెమికల్‌ ఇంజనీరింగ్‌ అభ్యసించారు.

1974లో కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా సభ్యుడిగా చేరారు. పార్టీ శాఖ కార్యదర్శిగా రాజకీయ జీవితం ఆరంభించారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1985లో ఫుజియాన్‌ ప్రావిన్స్‌లోని షియామెన్‌ నగర ఉప మేయర్‌గా ఎన్నికయ్యారు. 1979లో కే లింగ్లింగ్‌ను వివాహం చేసుకున్నారు. మనస్పర్థల కారణంగా కొద్ది కాలానికే ఆమె నుంచి విడిపోయారు. 1987లో ప్రముఖ జానపద గాయని పెంగ్‌ లియువాన్‌ను వివాహం చేసుకున్నారు.

వారికి కుమార్తె షీ మింగ్‌జే ఉన్నారు. ఆమె అమెరికాలో చదువుకుంటున్నారు. జిన్‌పింగ్‌ 1999 నుంచి 2002 దాకా ఫుజియాన్‌ గవర్నర్‌గా, 2002 నుంమచి 2007 దాకా ఝెజియాంగ్‌ గవర్నర్‌గా వ్యవహరించారు. 2007లో కమ్యూనిస్ట్‌ పార్టీ పొలిట్‌బ్యూరో స్టాండింగ్‌ కమిటీ(పీఎస్సీ)లో చేరారు. 2008 నుంచి 2013 దాకా చైనా ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. తొలిసారిగా 2012లో కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా ప్రధాన కార్యదర్శిగా, 2013లో చైనా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.  

పొగడ్తలు, తెగడ్తలు...
1949 అక్టోబర్‌ 1న పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా ఆవిర్భవించింది. ఆ తర్వాత జన్మించిన తొలి సీపీసీ ప్రధాన కార్యదర్శి జిన్‌పింగే. పార్టీలో ఎన్నో సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టారు. క్రమశిక్షణకు, అంతర్గతంగా ఐక్యతకు పెద్దపీట వేశారు. అవినీతిపై ఉక్కుపాదం మోపారు. సొంత పార్టీ మాజీ నేతలకు కూడా శిక్షలు విధించారు. ఇది చైనాలో ప్రశంసలందుకుంది. కానీ ఆయన విదేశాంగ విధానంపై భిన్న స్వరాలు వినిపించాయి. పదేళ్ల జిన్‌పింగ్‌ పాలనలో అమెరికాతో చైనా సంబంధాలు క్షీణించాయి.

భారత్‌తో సరిహద్దు వివాదాలు పెచ్చరిల్లాయి. తైవాన్‌ విషయంలో జిన్‌పింగ్‌ దూకుడు విమర్శలపాలవుతోంది. హాంకాంగ్‌లో నేషనల్‌ సెక్యూరిటీ చట్టం విషయంలోనూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. కరోనా పుట్టుకకు చైనాయే కారణమన్న నిందను మోయాల్సి వచ్చింది. జీరో–కోవిడ్‌ పాలసీ వల్ల చైనా ఆర్థిక వ్యవస్థ దిగజారుతోందన్న వాదనలున్నాయి. జిన్‌పింగ్‌ తయారీ రంగాన్ని ప్రోత్సహించారు. ఫలితంగా చైనా గ్లోబల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా ఎదిగింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top