breaking news
Shaanxi Province
-
చైనాలో గోల్డ్ రష్..!
బీజింగ్: ఒకటీరెండూ కాదు..ఏకంగా 20 కిలోల బంగారం, వెండి నగలు...బంగారం, డబ్బు నిండుగా ఉన్న ఇనుప బీరువా..! చైనాలోని ఓ ఊళ్లో జనం వీటిని సొంతం చేసుకునేందుకు తెగ వెతుకుతున్నారు. కొందరు బురద మట్టిని తవ్వి మరీ చూస్తున్నారు. మరికొందరైతే ఏకంగా మెటల్ డిటెక్టర్లను పట్టుకుని తిరుగుతున్నారు. ఇదంతా నిధీ నిక్షేపాల కోసం మాత్రం కాదు..వరదల్లో కొట్టుకుపోయిన సొత్తు కోసం సాగుతున్న ఎడతెగని అన్వేషణ..! ఏం జరిగిందంటే..జూలై 25వ తేదీన షాంగ్జి ప్రావిన్స్‌లోని వుక్వి కౌంటీలో భారీ వర్షాలతో అనూహ్యంగా వరదలు వచ్చాయి. కొన్ని నిమిషాల వ్యవధిలోనే మీటరు ఎత్తున వరద ఉప్పొంగి పట్టణాన్ని ముంచెత్తింది. ఆ వరద లావోఫెంగ్ జియాంగ్ దుకాణంలోకి కూడా ప్రవేశించింది. అధికార యంత్రాంగం వరద హెచ్చరికలతో ఆ రాత్రంగా జాగారం చేసిన దుకాణం సిబ్బంది, ఉదయం పూట యథా ప్రకారం దుకాణం తెరిచేందుకు ఉద్యుక్తులవుతున్నారు. బంగారం, ఇతర విలువైన సామగ్రిని సురక్షితంగా భద్రపర్చడం మర్చిపోయారు. సరిగ్గా ఆ సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా వేగంగా వరద ప్రవాహం దుకాణంలోకి చేరింది. తేరుకునేలోపే నగలున్న ట్రేలు, కాబిన్లను ఊడ్చిపెట్టుకుపోయింది. నగదు, నగలతోపాటు ఒక ఐరన్ సేఫ్ సైతం వరదతో పాటు మాయమైంది. బంగారం గొలుసులు, ఉంగరాలు, గాజులు, బ్రాస్లెట్లు, వజ్రపు ఉంగరాలు, వెండి ఆభరణాలు, పచ్చలు పోయిన వాటిల్లో ఉన్నాయి. ఐరన్ సేఫ్‌లో పెద్ద మొత్తంలో నగదుతోపాటు, కరిగించిన బంగారం, కొత్త బంగారు వస్తువులు ఉన్నాయి. వెరసి దుకాణదారుకు వాటిల్లిన నష్టం మార్కెట్ ధర ప్రకారం రూ.12 కోట్లని అంచనా. ఈ సొత్తు కోసం దుకాణం యజమాని కుటుంబంతోపాటు సిబ్బంది రెండు రోజులుగా కాళ్లకు బలపం కట్టుకుని మరీ ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. పోయిన వాటిలో సుమారు కిలో బంగారు ఆభరణాలు దొరికినట్లు అధికారులు చెబుతున్నారు. వరదల కారణంగా పట్టణంలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో, సీసీటీవీ ఫుటేజీ వ్యవస్థ దెబ్బతింది. దీనివల్ల వరద సమయంలో దుకాణంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు సరైన ఆధారమంటూ లేకుండా పోయింది. ఎవరైనా ఈ వస్తువులను తీసుకెళ్లారా? లేక వరదలోనే కొట్టుకుపోయాయా అనేది నిర్థారించడం సైతం కష్టంగా మారింది. తమ నగల దుకాణానికి సంబంధించిన విలువైన వస్తువులను ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా తీసుకున్నట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని యజమాని హెచ్చరిస్తున్నారు. దుకాణంలోని వస్తువులు వరదల్లో కొట్టుకుపోయినట్లు సమాచారం తెలుసుకున్న స్థానికులు సైతం గాలింపు మొదలుపెట్టారు. వరదలకు కొట్టుకు పోయి న బురద, మట్టిని తవ్వి మరీ చూస్తున్నారు. కొందరు మెటల్ డిటెక్టర్లతోనూ వెదుకుతున్నారు. ఈ గోల్డ్ రష్కు సంబంధించిన వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షమవుతున్నాయి. అయితే, స్థానికులెవరూ దొరికిన వస్తువులను తమకివ్వలేదని దుకాణం యజమాని చెబుతున్నారు. అలా ఎవరైనా తీసుకుపోయినట్లు తెలిస్తే సమాచారమివ్వాలని స్థానికులను కోరుతున్నారు. తెచ్చిన వారికి ఆ వస్తువు విలువను బట్టి బహుమతులను సైతం ఇస్తామని ఆశచూపుతున్నారు.బీజింగ్‌లో వర్షాలు, వరదల్లో 44 మంది మృతి చైనా రాజధాని బీజింగ్‌ను భారీ వర్షాలు, వరదలు కకావికలం చేశాయి. శనివారం కురిసిన కుండపోత వానలు, వరదల్లో కనీసం 44 మంది చనిపోగా, 9 మంది గల్లంతయ్యారు. గత నాలుగు రోజులుగా బీజింగ్ సహాయక, రక్షణ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో మరోసారి భీకరంగా వాన కురియడంతో రహదారులు తెగిపోవడంతోపాటు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని జనాన్ని సురక్షిత ప్రాంతాలకు యంత్రాంగం తరలిస్తోంది. బీజింగ్‌లో ఉత్తరాన ఉన్న పర్వతప్రాంత మియున్, యాంగ్వింగ్ జిల్లాల్లో అత్యధిక నష్టం వాటిల్లిందని అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. -
చైనాలో భారీ అగ్ని ప్రమాదం
బీజింగ్: చైనాలోని షాంగ్జి ప్రావిన్స్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో 26 మంది చనిపోగా మరో 38 మంది గాయపడ్డారు. లియులింగ్ నగరంలోని లిషి ప్రాంతంలో గురువారం ఉదయం 6.50 గంటలకు ఘటన చోటుచేసుకుంది. బొగ్గు గని కంపెనీకి చెందిన అయిదంతస్తుల భవనంలోని రెండో అంతస్తులో మొదలైన మంటలు భవనమంతటికీ వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. అగ్ని మాపక సిబ్బంది శ్రమించి మంటలను మధ్యాహ్నం 1.45కి అదుపులోకి తెచ్చారని చెప్పారు. చైనాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. భద్రతా ప్రమాణాలను పట్టించుకోకపోవడం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే వీటికి కారణమని చెబుతున్నారు. -
తండ్రిబాటలో నడిచి..చరిత్ర సృష్టించి.. జిన్‌పింగ్ ప్రస్థానమిదే..
చైనా అధినేత షీ జిన్‌పింగ్ 1953 జూన్ 15న శాన్‌షీ ప్రావిన్స్‌లో జన్మించారు. ఆయన తండ్రి షీ షీ ఝాంగ్‌షువాన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా, చైనా ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. జిన్‌పింగ్ బాల్యం ఎక్కువగా యావోడాంగ్ అనే పల్లెటూరిలో గడిచింది. తండ్రి ఆదేశాల మేరకు సాంస్కృతిక విప్లవ సమయంలో రైతులతో కలిసి సాధారణ జీవితం గడిపారు. వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నారు. ప్రాథమిక విద్య అనంతరం సింగువా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ అభ్యసించారు. 1974లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సభ్యుడిగా చేరారు. పార్టీ శాఖ కార్యదర్శిగా రాజకీయ జీవితం ఆరంభించారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1985లో ఫుజియాన్ ప్రావిన్స్‌లోని షియామెన్ నగర ఉప మేయర్‌గా ఎన్నికయ్యారు. 1979లో కే లింగ్లింగ్‌ను వివాహం చేసుకున్నారు. మనస్పర్థల కారణంగా కొద్ది కాలానికే ఆమె నుంచి విడిపోయారు. 1987లో ప్రముఖ జానపద గాయని పెంగ్ లియువాన్‌ను వివాహం చేసుకున్నారు. వారికి కుమార్తె షీ మింగ్జే ఉన్నారు. ఆమె అమెరికాలో చదువుకుంటున్నారు. జిన్‌పింగ్ 1999 నుంచి 2002 దాకా ఫుజియాన్ గవర్నర్‌గా, 2002 నుంమచి 2007 దాకా ఝెజియాంగ్ గవర్నర్‌గా వ్యవహరించారు. 2007లో కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ(పీఎస్సీ)లో చేరారు. 2008 నుంచి 2013 దాకా చైనా ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. తొలిసారిగా 2012లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రధాన కార్యదర్శిగా, 2013లో చైనా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పొగడ్తలు, తెగడ్తలు... 1949 అక్టోబర్ 1న పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆవిర్భవించింది. ఆ తర్వాత జన్మించిన తొలి సీపీసీ ప్రధాన కార్యదర్శి జిన్‌పింగే. పార్టీలో ఎన్నో సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టారు. క్రమశిక్షణకు, అంతర్గతంగా ఐక్యతకు పెద్దపీట వేశారు. అవినీతిపై ఉక్కుపాదం మోపారు. సొంత పార్టీ మాజీ నేతలకు కూడా శిక్షలు విధించారు. ఇది చైనాలో ప్రశంసలందుకుంది. కానీ ఆయన విదేశాంగ విధానంపై భిన్న స్వరాలు వినిపించాయి. పదేళ్ల జిన్‌పింగ్ పాలనలో అమెరికాతో చైనా సంబంధాలు క్షీణించాయి. భారత్‌తో సరిహద్దు వివాదాలు పెచ్చరిల్లాయి. తైవాన్ విషయంలో జిన్‌పింగ్ దూకుడు విమర్శలపాలవుతోంది. హాంకాంగ్‌లో నేషనల్ సెక్యూరిటీ చట్టం విషయంలోనూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. కరోనా పుట్టుకకు చైనాయే కారణమన్న నిందను మోయాల్సి వచ్చింది. జీరో–కోవిడ్ పాలసీ వల్ల చైనా ఆర్థిక వ్యవస్థ దిగజారుతోందన్న వాదనలున్నాయి. జిన్‌పింగ్ తయారీ రంగాన్ని ప్రోత్సహించారు. ఫలితంగా చైనా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఎదిగింది. -
32 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకి..
బీజింగ్ : చిన్నప్పుడు కిడ్నాప్‌కి గురైన వ్యక్తి చివరకు 32 ఏళ్ల తర్వాత తన కుటుంబ సభ్యులను చేరుకోగలిగాడు. 1988లో రెండేళ్ల వయసులో ఉన్నప్పుడు మావో ఇన్ అపహరణకు గురయ్యాడు. షాంగ్జీ ప్రావిన్స్‌లో గ్జియాన్‌లోని తమ నర్సరీ నుంచి ఇంటికి వెళుతుండగా, కుమారుడికి నీళ్లు తీసుకురావడానికి వెళ్లినప్పుడు కొందరు దుండగులు బాబును అపహరించారు. అప్పటి నుంచి తన కుమారుడి జాడ తెలిస్తే చెప్పాలని మావో ఇన్ తల్లిదండ్రులు కనిపించిన ప్రతి ఒక్కరినీ విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. గ్జియాన్ నగరంలో దాదాపు ప్రతి ఇంటికి వెళ్లి తమ బాబు కనిపించాడా అని అడిగారు. పోస్టర్లు అంటించారు. చివరకు తమ బాబు దొరకడేమనని నిరాశతో కుంగిపోయారు. మావో ఇన్ తల్లి లీ జింగ్జీ తన ఉద్యోగాన్ని కూడా వదిలేసి 10 ప్రావిన్స్‌లలోని అన్ని మున్సిపాలిటీలలో లక్షకుపైగా పాంప్లెట్లను పంచిపెట్టారు. ఎన్నో ఏళ్లుగా కొన్ని వందల టెలివిజన్ కార్యక్రమాల్లో తన కుమారుడి సమాచారం తెలిస్తే చెప్పాల్సిందిగా వేడుకున్నారు. తమ కుమారుడి పోలీకలకు దగ్గరగా ఉండి, అదే సమయంలో అపహరణకు గురైన దాదాపు 300 మందిని ఆమె కలుసుకున్నారు. కానీ, వారిలో ఒక్కరు కూడా తమ కుమారుడు కాదని డీఎన్ఏ పరీక్షల్లో తేలింది. ఇక చివరకు, తప్పిపోయినా, లేదా అపహరణకు గురైన చిన్నారులను తల్లిదండ్రుల చెంతకు చేర్చేలా సహాయపడాలని నిశ్చయించుకున్నారు. 2007లో ‘బేబీ కమ్ బ్యాక్ హోమ్’ పేరుతో వాలింటరీ గ్రూపును ప్రారంభించారు. ఇప్పటి వరకు మొత్తం 29 మంది చిన్నారులు తమ కుటుంబ సభ్యుల చెంతకు చేరేలా లీ జింగ్జీ కృషి చేశారు. గత ఏప్రిల్‌లో సిచువాన్ ప్రావిన్సులో ఓ వ్యక్తి నుంచి తమకు టిప్ అందిందని పోలీసులు తెలిపారు. ఏళ్ల కిందట తాము బాలుడిని దత్తత తీసుకున్నామని సదరు వ్యక్తి తెలిపాడు. దీంతో పోలీసులు దత్తత తీసుకున్న 34 ఏళ్ల మావో ఇన్ని గుర్తించి డీఎన్ఏ టెస్ట్ నిర్వహించారు. అప్పటికే తమ వద్ద ఉన్న లీ జింగ్జీ డీఎన్ఏతో మావో ఇన్ డీఎన్ఏ మ్యాచ్ అయింది. మావో ఇన్, ప్రస్తుత పేరు గూ నింగింగ్. డెకరేషన్ వ్యాపారం చేస్తున్నాడు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపాలని ఉందని తెలిపాడు. మావో ఇన్ని దుండగులు అపహరించి, పిల్లలు లేని తల్లిదండ్రులకి దాదాపు 60వేల రూపాయలకు అమ్మేశారని పోలీసులు తెలిపారు. మావో ఇన్ ఆచూకీ లభించిన విషయాన్ని సరిగ్గా మాతృదినోత్సవమైన 10 మేన లీ జింగ్జీకి పోలీసులు ఈ విషయాన్ని చెప్పారు. నా జీవితంలో నాకు దొరికిన బెస్ట్ గిఫ్ట్ ఇదే అని లీ జింగ్జీ కన్నీటి పర్యంతమయ్యారు. మావో ఇన్ చేతిని గట్టిగా పట్టుకుని నా కుమారుడిని ఇక వదిలి ఉండలేను అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నాకుమారుడిని తిరిగి కలుసుకోవడానికి సహకరించిన ఎన్నో వేలమందికి నేను రుణపడి ఉంటాను అని లీ జింగ్జీ అన్నారు. చైనాలో దశాబ్ధాలుగా చిన్న పిల్లల అపహరణ సమస్య కొనసాగుతోంది. ప్రతి ఏడాది దాదాపు 20వేల మందికిపైగా చిన్నారులు అపహరణకు గురి అవుతున్నారు. చైనాలో పబ్లిక్ సెక్యురిటీ మంత్రిత్వ శాఖ 2009లో డీఎన్ఏ డేటాబేస్‌ను సేకరించడం ప్రారంభించింది. దీని వల్ల ఇప్పటి వరకు 6000 మంది అపహరణకు గురైన చిన్నారులను గుర్తించారు. ఇక 2016 మేలో చైనా ప్రభుత్వం రీ యూనియన్ కార్యక్రమాన్ని చేపట్టింది. 2019 జూన్ వరకు ఈ కార్యక్రమం వల్ల 4వేలకు పైగా చిన్నారులు తమ తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
చైనాలో అగ్నిప్రమాదం, ఆరుగురి మృతి
బీజింగ్ : చైనాలోని షాంగ్జీ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం సంభవించి ఆరుమందికి పైగా మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుందని ఇందుకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు. బుధవారం నాడు ఇక్కడి అపార్ట్మెంట్ వద్ద స్థానికంగా పనిచేస్తున్న కొందరి మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. జ్ఞీ అనే ఇంటి పేరు ఉన్న ఓ వ్యక్తి నిన్న జరిగిన గొడవకు ప్రతీకారంగా అపార్ట్‌మెంట్‌కు నిప్పుపెట్టినట్లు వారు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిని షాంగ్జీ దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు వివరించారు. ప్రాథమికంగా దర్యాప్తు చేశామని ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపడతామన్నారు.