44 వంతెనల ప్రారంభం: చైనా తీవ్ర వ్యాఖ్యలు

China Comments On Ladakh After India Opens 44 Border Bridges - Sakshi

బీజింగ్‌: సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా మరోసారి భారత్‌ను ఉద్దేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. భారత కేంద్ర పాలిత ప్రాంతమైన లదాఖ్‌ను గుర్తించబోమంటూ విషం చిమ్మింది. అదే విధంగా అరుణాచల్‌ ప్రదేశ్‌లో చేపట్టిన నిర్మాణాలను కూడా వ్యతిరేకిస్తున్నామంటూ అక్కసు వెళ్లగక్కింది. కాగా లదాఖ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూకశ్మీర్‌ తదితర వ్యూహాత్మక ప్రాంతాల్లో 44 నూతన వారధులను భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సోమవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. కొత్తగా నిర్మించిన ఈ బ్రిడ్జీలతో ఆయా వ్యూహాత్మక ప్రాంతాలకు భారత సైనికుల రాకపోకలకు మరింత సౌలభ్యం కలుగనుంది. ఈ విషయంపై స్పందించిన చైనా విదేశాంగ శాఖ మంగళవారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. (చదవండి: పథకం ప్రకారమే పాక్, చైనా కయ్యం)

ఈ మేరకు డ్రాగన్‌ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి జావో లిజియన్‌ మాట్లాడుతూ.. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల నిర్మాణమే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసిందన్నారు. విలేకరుల ప్రశ్నలకు బదులిస్తూ.. లదాఖ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లను తాము గుర్తించబోమని వ్యాఖ్యానించారు. అదే విధంగా చైనా- భారత్‌ల మధ్య కుదిరిన ఏకాభిప్రాయానికి కట్టుబడి సరిహద్దుల్లో శాంతి, సుస్థిరత నెలకొనేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  ఇదిలా ఉండగా.. గల్వాన్‌ లోయలో ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య పలు దఫాలుగా దౌత్య, మిలిటరీ స్థాయి చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం చూషుల్‌ వద్ద మరోసారి మిలిటరీ అధికారులు చర్చలు జరిపారు. ఈ విషయం గురించి చైనా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. బలగాల ఉపసంహరణ విషయంలో లోతైన, సానుకూల చర్చ జరిగిందని పేర్కొంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top