పథకం ప్రకారమే పాక్, చైనా కయ్యం

Border disputes created by China And Pakistan - Sakshi

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

వ్యూహాత్మక ప్రాంతాల్లో 44 నూతన వారధులు ప్రారంభం

న్యూఢిల్లీ: సరిహద్దు విషయంలో దాయాది దేశం పాకిస్తానే కాదు చైనా సైతం తరచూ భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది. తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనా మధ్య గత ఐదు నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే, ఒక పథకంలో(మిషన్‌) భాగంగానే పాక్, చైనా సరిహద్దు వివాదాలు సృష్టిస్తున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చెప్పారు. ఆయన సోమవారం 44 నూతన వారధులను ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు. లద్దాఖ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూకశ్మీర్‌లో వ్యూహాత్మక ప్రాంతాల్లో ఈ వారధులు ఉన్నాయి. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ.. పాకిస్తాన్, చైనా దేశాలతో భారత్‌కు 7,000 కిలోమీటర్ల సరిహద్దు ఉందని తెలిపారు.

భారత్‌కు ఇబ్బందులు కలిగించాలని ఉత్తర దిశ నుంచి పాకిస్తాన్, తూర్పు దిశ నుంచి చైనా ఒక పథకం ప్రకారం ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. నూతన బ్రిడ్జీలతో ఆయా వ్యూహాత్మక ప్రాంతాలకు మన సైనికుల రాకపోకలకు మరింత సౌలభ్యం కలుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. వారు సులువుగా అక్కడికి చేరుకోగలుగుతారని వెల్లడించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, పాకిస్తాన్, చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లు వంటి వాటిని సమర్థంగా ఎదుర్కొంటూనే భారత్‌ అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతోందని రాజ్‌నాథ్‌సింగ్‌ వ్యాఖ్యానించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో నిర్మించనున్న 450 మీటర్ల సొరంగ మార్గం నెచిపూ టన్నెల్‌ నిర్మాణానికి ఆయన ఆన్‌లైన్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ను రాజ్‌నాథ్‌ ప్రశంసించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top